నరసరావుపేట: వ్యాపార, వాణిజ్య వర్గాల్లో కీలకమైన చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి నూతన అధ్యక్షుడిగా అత్తులూరి సుబ్బారావు (సుబ్బు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026–28 రెండేళ్ల కాలానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. స్థానిక కోట సెంటర్‌లోని వాసవి కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. గత కమిటీ రెండేళ్ల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో చాంబర్ పెద్దలు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, సభ్యుల సమక్షంలో అత్తులూరి సుబ్బారావును నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అత్తులూరి ఎన్నిక పట్ల వివిధ వ్యాపార, వాణిజ్య అసోసియేషన్ల ప్రతినిధులు, చాంబర్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. సుబ్బారావు నాయకత్వంలో చాంబర్ మరింత బలోపేతమై, వ్యాపారుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న చాంబర్ సభ్యులు, పెద్దలు, వివిధ అసోసియేషన్ ప్రతినిధులకు అత్తులూరి సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రెండేళ్లలో వ్యాపారుల సంక్షేమం, వాణిజ్య రంగ అభివృద్ధి, వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న సుబ్బారావును ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, బులియన్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు వనమా సాంబశివరావు, పచ్చిపులుసు సతీష్‌కుమార్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఊర భాస్కరరావు, కపలవాయి రమేష్ చంద్రదత్, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు అభినందించారు.
మాదల(ముప్పాళ్ళ): ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మాదల గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. సంఘటనకు సంబందించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన మువ్వా గణేష్(25) తన స్నేహితులతో కలిసి ఇంటి డాబా పై కలిసి నిద్రించే సమయంలో వర్షం పడుతుంది. ఈ క్రమంలో స్నేహితులు కిందికి రాగా, గణేష్ డాబా పై ఉన్న టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మెట్లపై నుంచి కింద పడ్డాడు. కిందపడి ఉన్న గణేష్‌ను తెల్లవారిన తర్వాత కుటుంబసభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. గణేష్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.అనిల్‌కుమార్ తెలిపారు.


