ప్రగతిలో ఆదివాసీలు భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రగతిలో ఆదివాసీలు భాగస్వాములు కావాలి

Aug 10 2026 2:10 AM | Updated on Aug 10 2026 2:10 AM

నరసరావుపేట: దేశాభివృద్ధిలో ఆదివాసీ సమాజం భాగస్వామ్యం మరింత పెరగాలని

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. వారి హక్కులను గౌరవిస్తూ అభివృద్ధికి తోడ్పడుతూ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పల్నాడు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆమె మాట్లాడారు. కలెక్టర్‌తోపాటు స్థానిక శాసనసభ్యుడు డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం పంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌, ఏకలవ్య, చెంచులక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.

అనంతరం కలెక్టర్‌ ప్రసంగిస్తూ... ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం అడవులపై హక్కులు ఆదివాసీలకే ఉన్నాయని చెప్పారు. ఆదివాసీ తెగలు, భాషలు పలు కారణాలతో అంతరించిపోతున్న నేపథ్యంలో సాంస్కృతిక జీవనం, హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఈ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో 1.5 లక్షల ఆదివాసీ జనాభా ఉందని, కొన్ని ఫారెస్ట్‌ ఏరియా పక్కన ఉన్న గ్రామాలు ఐసీడీఎస్‌ పరిధిలో ఉన్నాయన్నారు. చిలకలూరిపేట శివారుల్లో ఆదివాసీ హాబిటేషన్స్‌ వచ్చాయన్నారు. జిల్లా యంత్రాంగం ద్వారా వారికి మౌలిక వసతులైన కరెంటు, వాటర్‌, హౌసింగ్‌ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ ఆదివాసీలందరూ బాగా చదువుకుని ఆర్థికంగా పైకి రావాలని పేర్కొన్నారు. ఈ ఏడాది పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు, మెమొంటోలను ప్రదానం చేశారు. ఆదివాసీ నాయకులను సత్కరించారు. ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డీఆర్‌ఓ కె. అద్దెయ్య, ఆర్‌డీఓ కె. బాలకృష్ణ, ఏపీ గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోట నాయక్‌, గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్‌, గిరిజన విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు పాండు నాయక్‌, ఏపీ ఆదివాసీ హక్కుల సేవా సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మేడ పోతురాజు, డీవీఆర్‌సీ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ మల్లెల చిన్నప్ప, ఏకలవ్య ఎరుకల సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. సురేష్‌, యానాది జాగృతి జిల్లా అధ్యక్షులు చలంచర్ల విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement