నరసరావుపేట: స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావుకు మంగళవారం కలెక్టరేట్‌లో ఘనంగా నివాళులర్పించారు. శత జయంతి ఉత్సవాలు సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మండలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.అద్దెయ్య, జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, టూరిజం అధికారి నాయుడమ్మ, అధికారులు పాల్గొన్నారు.
నరసరావుపేట ఈస్ట్: శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్‌షిప్– 2026 పోటీల్లో భాగంగా జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలను ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన నియోజకవర్గస్థాయి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపిక చేసిన 12 క్రీడాంశాలలో పోటీలు కొనసాగుతాయని వివరించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్, జనన ధ్రువీకరణ, రిజిస్ట్రేషన్ పత్రాలతో 7వ తేదీ ఉదయం 9గంటలకు హాజరు కావాలని తెలిపారు. క్రీడాకారులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. వివరాలకు 87126 22574 నెంబరులో సంప్రదించాలని కోరారు.


