ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

యడ్లపాడు: ఒక్కగానొక్క కొడుకే ఆ దంపతులకు లోకమైంది. ఎదుగుతున్న ఆ బిడ్డను ఉన్నత చదువుల కోసం గుంటూరు పంపితే... నాలుగు రోజుల కిందట సెలవుపై వచ్చి, చివరికి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. కొండవీడు ఎస్సీ కాలనీకి చెందిన కట్టా ఐజాక్‌ వెస్లీపాల్‌ (17) మంగళవారం ఉదయం తన నివాస సమీపంలోని ఓ దుకాణంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని కొండవీడుకు చెందిన థామస్‌, కెజియా దంపతుల కుమారుడు వెస్లీపాల్‌. గుంటూరు నారాయణ జూనియర్‌ కళాశాలలో ఈ ఏడాది ఫస్టియర్‌ చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం హోమ్‌సిక్‌ లీవ్‌పై స్వగ్రామానికి వచ్చాడు. సోమవారమే హాస్టల్‌కు వెళ్లాల్సి ఉండగా, ‘రేపు వెళ్తానులే’ అని తల్లిదండ్రులకు చెప్పాడు. మంగళవారం ఉదయం స్నానం చేసి, కొత్త దుస్తులు ధరించి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో ఆందోళనతో వెతికిన తల్లికి... ఇంటి సమీపంలోని దుకాణం వద్ద కొడుకు ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆ తల్లి గుండెలు అవిసేలా రోధించిన తీరు స్థానికులను సైతం కన్నీళ్లు పెట్టించింది. బిడ్డే లోకంగా జీవిస్తున్న థామస్‌కు ఏడాదిన్నర క్రితం మెదడు శస్త్రచికిత్స జరిగింది. ఈ తరుణంలో తన బిడ్డ మరణం ఆ దంపతుల్ని నిలువున కుంగదీసింది. సమాచారం అందుకున్న యడ్లపాడు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చదువులో వెనుకబడుతున్నాననే మనస్తాపమే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా తెలిసిందని పోలీసులు తెలిపారు. ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ చెప్పారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొండవీడు గ్రామంలో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఈ ఘటనతో ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది.

కొండవీడు ఎస్సీ కాలనీలో విషాద ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement