లక్ష్మీపురం: మిర్చి బస్తాల వరుస చోరీలకు పాల్పడుతున్న 10 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు వాహనాలు, రూ. లక్ష నగదు, పది మిర్చి బస్తాలను స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నగరంపాలెం సీఐ మునిపల్లి రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం... హౌసింగ్ బోర్డు, నల్లపాడు ప్రాంతానికి చెందిన బత్తుల శంకరావు మిర్చి యార్డులో మేసీ్త్రగా పని చేస్తున్నారు. జూలై 30వ తేదీన గురజాల నుంచి కొనుగోలు చేసిన 120 మిర్చి బస్తాలను ట్రాక్టర్‌లో గుంటూరు మిర్చి యార్డుకు తీసుకొస్తుండగా, యార్డులో రద్దీ ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ట్రాక్టర్‌ను రామిరెడ్డి నగర్ శ్మశానవాటిక ఎదురుగా నిలిపి విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం మిర్చి యార్డులో రద్దీ తగ్గిన తర్వాత ట్రాక్టర్‌ను యార్డు లోపలికి తీసుకెళ్లి లోడును దించారు. అదే సమయంలో 38 మిర్చి బస్తాలు చోరీకి గురైనట్లు గుర్తించి నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో గుంటూరు వెస్ట్ డివిజన్ ఇన్‌చార్జి డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు పర్యవేక్షణలో నగరంపాలెం సీఐ మునిపల్లి రాజేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.
రూ. లక్షకు విక్రయం
ఈ క్రమంలో అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం గుంటూరు నగరంలో పది మంది మిర్చి బస్తాల చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. విచారణలో జూలై 30వ తేదీన ట్రాక్టర్ నుంచి 38 మిర్చి బస్తాలను కాజేసి మూడు టాటా ఇన్‌ట్రా వాహనాల్లో తరలించారని వెల్లడైంది. అనంతరం ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామానికి చెందిన వ్యక్తికి రూ. లక్షకు విక్రయించినట్లు ఒప్పుకొన్నారు. వారి నుంచి రూ. లక్ష నగదు, చోరీకి వినియోగించిన మూడు టాటా ఇన్‌ట్రా వాహనాలు, ఒక ద్విచక్ర వాహనం, పది మిర్చి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన కృష్ణబాబు కాలనీకి చెందిన మోచర్ల దుర్గారావు, కొండేటి దుర్గారావు, బాపట్ల జిల్లా చుండూరు గ్రామానికి చెందిన (ప్రస్తుతం కృష్ణబాబు కాలనీలో నివాసం ఉంటున్న) నాగిపోగు రాజేష్, మోటమర్రి మరియదాసు, కట్టా ఆనందరావు, పొన్నాల నరసింహారావు, షేక్ నాగూర్, షేక్ మున్నా బాషా, దేవళ్ల లక్ష్మీనారాయణ, షేక్ సంజీత్‌లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ఆవుల గణేష్ పరారీలో ఉండగా, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
రూ.లక్ష నగదు, 4 వాహనాలు,
10 మిర్చి బస్తాలు స్వాధీనం


