నిరుద్యోగులను దారుణంగా మోసగించిన చంద్రబాబు సర్కార్ ప్రజల పక్షాన పోరాడి ప్రభుత్వం మెడలు వంచుతాం నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కీలక నేతలు ధ్వజం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేత
మోసపోయిన నిరుద్యోగులు
ఇది దగాకోరు ప్రభుత్వం
కావాల్సిన వారికే ఉద్యోగాలు
లోకేష్ ‘అవినీతి’ మంత్రి
నరసరావుపేట: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులను దారుణంగా దగా చేసిందని వైఎస్సార్‌సీపీ కీలక నేతలు ఆరోపించారు. దీనిపై ఆడియా, వీడియా టేపులు స్పష్టంగా ఉన్నందున సీబీఐతో విచారణ చేయించాలని, అప్పటివరకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో ఆధారాలతో శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్లమెంటు పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ రెడ్డి, పలు నియోజకవర్గాల పరిశీలకులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కాలి నడకన వచ్చారు. ‘ఇదేమి రాజ్యం – దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం’, ‘డౌన్ డౌన్ లోకేష్’ వంటి నినాదాలు చేశారు. డీఎస్సీ పేరిట కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరుద్యోగులు గుర్తించేలా, వారికి న్యాయం చేసేలా పార్టీ తరఫున పోరాటం చేస్తామని నాయకులు చెప్పారు. గేటు దాటి లోపలికి వెళ్లేందుకు పోలీసులు అందరినీ అనుమతించలేదు. దీంతో కొందరు మాత్రమే లోనికి వెళ్లారు. కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా... ఆమె సూచన మేరకు డీఆర్‌ఓ అద్దెయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధరరెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, బాసు లింగారెడ్డి, పడాల శివారెడ్డి, చిట్టా విజయభాస్కరరెడ్డి, దొంతిరెడ్డి అంజిరెడ్డి, రేపాల శ్రీనివాసరావు, యువజన, విద్యార్థి విభాగాల జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంతరెడ్డి, గుజ్జర్లపూడి ఆకాష్‌రెడ్డి, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మద్దిరెడ్డి నరసింహారెడ్డి, గంటెనపాటి గాబ్రియేలు, గెల్లి బ్రహ్మారెడ్డి, రాష్ట్ర అంగన్‌వాడీ విభాగ కార్యదర్శి జి.హెల్డా ఫ్లోరెన్స్, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి అంటేనే అవినీతి మంత్రిగా లోకేష్‌కు ముద్ర పడిందన్నారు. డీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ర్యాంకు తెచ్చుకున్న వారికి అన్యాయం జరిగిందన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను తప్పుడు జీవో ఆధారంగా అమ్ముకున్నారని ఆరోపించారు. అవినీతికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కి పిలిచిన వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా తర్వాత స్థానంలోని వారికి ఇచ్చారని తెలిపారు.
జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ పారదర్శకంగా ఒకేసారి 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు అమ్ముకోవాలనే ఉద్దేశంతో జీఓ 47 రిలీజ్ చేశారని చెప్పారు. రూ.9,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాల్సి ఉందన్నారు. సూపర్ సిక్స్ పేరుతో పేద, మధ్యతరగతి వారిని మోసగించారని ధ్వజమెత్తారు. డీఎస్సీ అభ్యర్థుల పక్షాన పోరాడతామన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దగాకోరు ప్రభుత్వం ఉందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అవి ఇచ్చేవరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని దగా చేశారన్నారు. లోకేష్ ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్‌కు దొంగమార్గంలో డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నాయకులను గట్టిగా నిలదీయాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబు సర్కారుపై తాము పోరాటం చేస్తామన్నారు.
సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహించి అవినీతికి పాల్పడ్డారని పాలకులపై ధ్వజమెత్తారు. కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. కష్టపడి చదివిన వారికి అన్యాయం జరిగినట్లు తెలిపారు. దొంగ ధ్రువపత్రంతో నిజమైన క్రీడాకారులను పక్కనపెట్టారని ఆరోపించారు. ఆర్చరీలో గోల్డ్‌మెడల్ సాధించిన వ్యక్తిని 1:1 నిష్పత్తిలో పిలిచి ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. డీఎస్సీ పెద్ద స్కాం అని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు.


