రెండు నెలలైనా నీరందక అన్నదాతలకు దిగులు సమృద్ధిగా వానలు కురవక సాగు అంతంత మాత్రమే ముందస్తు రబీ సాగుపై రైతుల ఆశలు దిక్కులేక మొక్కజొన్న వైపు మొగ్గు జలాశయాల్లోకి నీరొస్తేనే మిర్చి, వరి పంటకు అవకాశం మరో పదిహేను రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సీజన్ లేనట్టే
సాగర్ వెలవెల
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు పూర్తవుతున్నా పంటల సాగు రైతులు ముందుకు రావడం లేదు. సాధారణ సాగు లక్ష్యంలో కనీసం పావు వంతు కూడా పూర్తి కాలేదు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొనడం, జలాశయాల్లోకి నీరు చేరకపోవడంతో సాగుకు రైతన్నలు వెనుకడుగు వేస్తున్నారు. రెండు రోజులుగా తొలకరి చినుకులు కురుస్తున్నా, సాగుకు ఉపయోగపడేలా నేల పూర్తిస్థాయిలో తడిసేలా పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో వ్యవసాయ పంటల ఖరీఫ్ సాధారణ సాగు లక్ష్యం 1,57,932 హెక్టార్లు కాగా, ప్రస్తుతం కేవలం 35,923 హెక్టార్లలోనే సాగు పూర్తైంది. ఇది మొత్తం లక్ష్యంలో 22.70 శాతం మాత్రమే. ఇందులో అత్యధికంగా 34,490 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. అది కూడా పత్తి సాగు లక్ష్యం 86,305 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు సాగైనది కేవలం 40 శాతం మాత్రమే. ఆగస్టు నెల ప్రారంభం కానుండటంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో పూర్తిస్థాయిలో పత్తి సాగు కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.
వానలు లేక ఆందోళన
ఇప్పటికే సాగు చేసిన పత్తి పంటకు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కొంతమేర ఉపయోగపడే అవకాశముంది. అయితే ఇప్పటికే కొందరు రైతులు ఎండిపోయిన మొక్కలను ట్రాక్టర్లతో దున్నేసి మరోసారి సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా ఈ సమయానికి వరి నారుమళ్లు, కంది సాగు పుంజుకోవాలి. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదు. జిల్లాలోని 28 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అవుతుండటంతో ఈ ఏడాది సాగు సాధ్యమవుతుందా అనే అనుమానం కర్షకుల్లో మొదలైంది. ఎల్‌నినో ప్రభావం పల్నాడు జిల్లాపై అధికంగా కనిపిస్తోంది. జిల్లాలో ఈ నెల 31వ తేదీ నాటికి సాధారణంగా 366.67 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 96.84 సెం.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈపూరు, చిలకలూరిపేట, యడ్లపాడు, శావల్యాపురం, బొల్లాపల్లి మండలాల్లో వర్షపాతం మరింత ఆందోళనకరంగా ఉంది.
మరోవైపు, గత ఏడాది ఇదే సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నీటితో కళకళలాడుతూ క్లస్టర్ గేట్ల నుంచి వరద నీరు ప్రవహించింది. అయితే ఈ ఏడాది సాగర్‌లోకి ఇప్పటివరకు కనీసం ఒక్క టీఎంసీ నీరు కూడా రాకపోవడం ఆందోళనకరంగా మారింది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 136.99 టీఎంసీలే ఉన్నాయి. ఇది డెడ్ స్టోరేజ్‌కు దాదాపు సమానంగా ఉంది. శ్రీశైలానికి నీటి ప్రవాహం మొదలైనా, నాగార్జునసాగర్ నిండాలంటే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవాల్సి ఉంది. దీంతో వరి, ఇతర వాణిజ్య పంటల సాగుకు రైతన్నలు వెనుకడుగు వేస్తున్నారు. కొందరు రైతులు ముందస్తు రబీ సాగుపై ఆశలు పెట్టుకున్నారు. పత్తి పంట సాగు చేయాలనుకున్న వారిలోనే కొందరు మొక్కజొన్న వేయాలనే ఆలోచనలో ఉన్నారు. వర్షాకాలం రెండో భాగంలో అయినా సమృద్ధిగా వర్షాలు కురిస్తే ముందస్తు రబీ పంట ఆశాజనకంగా ఉంటుందనే భావన వారిలో నెలకొంది.


