నరసరావుపేట: జిల్లాలో సమగ్ర ఓటరు రివిజన్ (సర్) ప్రక్రియ మంగళవారం సాయంత్రం నాటికి 89.19 శాతం పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 17,41,798మంది ఉండగా 1932మంది బీఎల్‌ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లకు వందశాతం అందజేశారన్నారు. వీరిలో తమకు పూర్తిచేసి అందజేసిన ఫారాలలో 15,53,455మందివి డిజిటలైజేషన్ చేయటం జరిగిందన్నారు.
సెక్యూరిటీ అలారం
మోగడంతో పరారీ
మంగళగిరి టౌన్: మెడికల్ షాపులో చోరీకి వచ్చి అలారమ్ మోగడంతో వారు పరారీ అయిన ఘటన మంగళవారం తెల్లవారుజామున మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్ సమీపంలో గౌతమబుద్ధ రోడ్డు వెంబడి శ్రీ ధాత్రి సాయి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్‌ను పట్టణానికి చెందిన ఫణీంద్ర అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తన ఫోన్‌లో అలారం మోగడంతో వెంటనే షాపు సీసీ కెమెరాలను తన ఫోన్‌లో చూశాడు. అదే సమయంలో అలారం ఏర్పాటు చేసిన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ వారు కూడా ఫణీంద్రకు ఫోన్‌లో సమాచారం అందించారు. అయితే సీసీ కెమెరాల్లో ఏమీ కనబడకపోవడంతో నిద్రపోయాడు. వెంటనే మరుక్షణంలోనే అలారం మోగడంతో తన ఫోన్‌లో సీసీ కెమెరా ఓపెన్ చేయగా షట్టర్ పగలకొట్టి లోపలకు ఓ వ్యక్తి ప్రవేశించడం గమనించాడు. వెంటనే తన ఫోన్‌లో అలారం బటన్ నొక్కి తన షాపులో మోగే విధంగా ఏర్పాటు చేశాడు. దీంతో దుండగుడు వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంటి వద్ద నుంచి షాపు వద్దకు వచ్చి చూడగా షట్టర్ తాళాలు పగలకొట్టి, పైన ఉన్న సీసీ కెమెరా పక్కకు వంచి ఉండడం, సైరన్ బాక్స్ పగలకొట్టి ఉండడం గమనించాడు. వెంటనే పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాడు. అయితే పోలీసులు సరిగా స్పందించలేదని బాధితుడు తెలిపాడు. షాపులో ఎటువంటి నష్టం వాటిల్లకపోవడంతో ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు.
గతంలో ఇదే తరహాలో....
మూడేళ్ల క్రితం 2023 జూలై నెలలో ఇదే తరహాలో షాపు పైభాగంలో రంద్రం చేసి దుండగుడు లోపలకు ప్రవేశించాడని, షాపులో వున్న అధిక మొత్తంలో నగదును, హార్డ్‌డిస్క్ అపహరించుకుపోయినట్లు బాధితుడు ఫణీంద్ర తెలిపాడు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీస్ అధికారులు, క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించి విచారించారని, కానీ నేటికీ ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదని, అందువల్లే ఇప్పుడు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయడానికి నిరాకరించినట్లు పేర్కొన్నాడు.
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఎగువ సన్నిధి కొండపై వున్న గండాలయ స్వామిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కొండపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్‌లో ద్విచక్రవాహనాల ద్వారా భక్తులు ప్రయాణాలు చేస్తారు. అమావాస్య కావడంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి కొండపైకి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఘాట్‌రోడ్‌లో వస్తుండగా రెండు ద్విచక్రవాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయాయి. వాటిపై ఉన్న ఇద్దరు యువకులు లోయలోకి జారుకున్నారు. గమనించిన పలువురు భక్తులు వారిని పైకి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద భరితంగా ఉన్న ఘాట్‌రోడ్‌లో ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు, సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్సకోసం స్థానిక దేవస్థానం సిబ్బందిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
కార్మికుడి కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో దొండపాడు వద్ద పనిచేస్తూ మట్టి గడ్డలు పడి ప్రమాదంలో ఒడిశాకు చెందిన వలస కార్మికుడు 21 సంవత్సరాల గుడు సాహూ మృతి చెందడం బాధాకరం అని సీఐటీయూ నాయకులు అన్నారు. ఆ కుటుంబానికి తను పనిచేస్తున్న ఎన్‌సీసీ కంపెనీ యాజమాన్యం రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రాజధాని డివిజన్ సీఐటీయూ అధ్యక్ష ,కార్యదర్శులు ఎం.రవి, బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. తుళ్లూరు పీహెచ్‌సీలో ఉన్న గుడ్డు సాహు మృతదేహాన్ని సీఐటీయూ బృందం పరిశీలించి, వారి బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని నిర్మాణ పనులు చేపడుతున్న కార్మికులు, వలస కార్మికులకు రక్షణ కల్పించాల్సిన పూర్తి బాధ్యత సీఆర్డీయేకు, ఏడీసీలకు ఉందన్నారు. రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడేందుకు సీఐటీయూ బృందం ప్రయత్నించినా దాటవేసే ప్రయత్నం చేశారని, ఎక్స్‌గ్రేషియా ఇవ్వకుండా మభ్యపెట్టాలని చూస్తే భవిష్యత్తలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్మికుడు గుడ్డు సాహు మృతదేహాన్ని సీఐటీయూ రాజధాని డివిజన్ కార్యదర్శి బి.లక్ష్మణరావు, నాయకులు జె.నవీన్ ప్రకాష్, పి.బాబురావులు పరిశీలించి, మృతుని బంధువులను పరామర్శించారు.


