నరసరావుపేట: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాఽభం మృతికి పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంచితనానికి, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం ముద్రగడ అన్నారు. ఆనాడు ఎన్‌టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి ఆదర్శమైన మంత్రిగా మెలిగారన్నారు. ఇటువంటి నిజాయతీ గల వ్యక్తిని కోల్పోవటం దురదృష్టకరం అన్నారు. ఆయన మృతి రాష్ట్ర భవిష్యత్‌కు, కాపు ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
బాపట్ల: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతికి మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముద్రగడ మృతి తీరని లోటని కోన అభిప్రాయపడ్డారు. ఉద్యమ నాయకుడిగా ఆయన చూపిన ధైర్యం, నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పొన్నూరు: ప్రముఖ కాపు నేత, రాజకీయ నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం మృతికి వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రేపల్లె: కాపు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి కాపు జాతికే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ తీరని లోటని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన ముద్రగడ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కాపు సమాజానికి న్యాయం జరగాలనే లక్ష్యంతో ముద్రగడ జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు.


