నరసరావుపేట రూరల్: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 31వ తేదీన సమ్మెతో పాటు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు డి.శివకుమారి తెలిపారు. ఈ మేరకు గురువారం కోటప్పకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా శివకుమారి మాట్లాడుతూ ఆశ వర్కర్ల వేతనాలు పెంచి ఏడు సంవత్సరాలు గడిచిపోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతనాలను సవరించి అమలు చేయాల్సి ఉన్నప్పటికి, ఆ బాధ్యత నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమయిందని తెలిపారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ సెలవు దినాలను వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల సాధన, ఉద్యోగ భద్రత కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 31 తేదీన ఉదయం 10 గంటలకు నరసరావుపేటలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో పెద్ద ఎత్తున ఆశ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు గోవిందమ్మ, సుగుణమ్మ, సీఐటీయూ మండల కన్వీనర్ షేక్ సిలార్, రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా
గుంటూరు ఎడ్యుకేషన్: కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక విద్యాబోధన నైపుణ్యాలు అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా అన్నారు. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మంగళవారం డివిజన్ స్థాయిలో వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమంతో పాటు డీఆర్పీలకు జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని పట్టాభిపురం, వేణుగోపాల్‌నగర్‌లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించారు. ఈసందర్భంగా డీఈఓ సలీమ్ బాషా మాట్లాడుతూ మారిన సిలబస్, లీప్ యాప్, తదితర అంశాలపై శిక్షణలో నేర్చుకున్న అంశాలను డివిజన్ స్థాయిలో శిక్షణ కల్పించాలని సూచించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో తరగతి గదిలో విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే విధంగా బోధించి, పాఠశాలలను అభివృద్ధి బాట పట్టించాలన్నారు. కోర్సు కో–ఆర్డినేటర్ కె.విజయభాస్కర్ మాట్లాడుతూ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ రెండు రోజులపాటు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో స్టేట్ రీసోర్స్ పర్సన్, డైట్ అధ్యా పకులు, డీఆర్పీలు పాల్గొన్నారు.
తాడేపల్లిరూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని గురుకుల రాష్ట్ర కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘం నేతలు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకపక్కన రోడ్డుపై కూర్చొని ఉపాధ్యాయులు నిరసన చేస్తుంటే మరోపక్క విధులు నిర్వహించడానికి వచ్చిన అదనపు పోలీస్ సిబ్బంది ఇదేమీ పట్టనట్లు కార్యాలయం కింద పార్కింగ్ ప్లేస్‌లో క్యారమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు. ధర్నా జరుగుతున్నంత సేపు ఆడుకుంటూ ఉన్నారు. ధర్నా జరుగుతున్నా అటువైపు చూడకుండా ఆటలో నిమగ్నమవ్వడంతో అక్కడి అధికారులు నివ్వెరపోయారు. ధర్నా జరిగే సమయంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే పరిస్థితి ఏంటంటూ అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. అక్కడున్న విలేకరులు ఫొటోలు తీయడానికి ప్రయత్నించినా వారితో వ్యంగ్యంగా మాట్లాడి క్యారమ్స్ ఆడడం మాత్రం ఆపలేదు.


