నకిలీ పోలీసుల ఆటకట్టించిన తెనాలి పోలీసులు నిందితుల్లో ఒకరు బీఎస్‌ఎఫ్ మాజీ జవాను, మరొకరు పాత నేరస్తుడు
తెనాలిరూరల్: వృద్ధులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల నకిలీ పోలీసులను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్ధనరావు వివరాలను వెల్లడించారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కావటి కిరణ్‌కుమార్, సదుపాటి మురళి స్నేహితులు. కిరణ్‌కుమార్ గతంలోనే నకిలీ పోలీస్ అవతారమెత్తి, పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. గుంటూరు, చీరాల, ఇంకొల్లు, వేటపాలెం, ఒంగోలు, నందిగామల్లో నేరాలకు పాల్పడ్డాడు. ఇతనిపై 12 కేసులు ఉన్నాయి. మురళి 12 ఏళ్లు బీఎస్‌ఎఫ్‌లో పనిచేసి 2012లో ఉద్యోగం వదిలి వచ్చేశాడు. మద్యం, ఇతర వ్యసనాలకు బానిసైన మురళి కిరణ్‌కుమార్‌తో కలిసి ఇటీవలి కాలంలో నేరాలకు పాల్పడుతున్నాడు. ఈనెల 7వ తేదీన కొల్లిపర చెందిన మల్లికార్జున రెడ్డి నందివెలుగు నుంచి స్కూటీపై తెనాలి వస్తుండగా ఆటోనగర్ వద్ద అతడిని ఇద్దరు నిందితులు అడ్డగించి పోలీసుల పేరుతో బెదిరించారు. స్కూటీని చెక్ చేయాలంటూ భయపెట్టి డిక్కీలో ఉన్న రూ. 1.60 లక్షల నగదులో రూ.50,000 లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. అదే రోజు దుగ్గిరాల సమీపంలోని కొత్త పెట్రోల్ బంకు వద్ద మోపెడ్‌పై వెళుతున్న వృద్ధుడు మహమ్మద్ ఫరూక్‌ను కూడా బెదిరించి అతని వద్ద ఉన్న రూ 7వేలు తీసుకొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 57 వేల నగదు, పల్సర్ బైక్ స్వాధీనపర్చుకున్నారు. నిందితులను తక్కువ సమయంలోనే గుర్తించి అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులను డీఎస్పీ అభినందించారు. సయావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్‌ఐ కె.ఆనంద్, సిబ్బంది ఉన్నారు.


