చీరాల టౌన్: అధికారం చేతిలో ఉంది.. అధికారులు మా కిందే ఉన్నారు... మా మాటకు అడ్డు లేదంటూ టీడీపీ గ్రామ, మండల స్థాయి నాయకులు సచివాలయంలో తిష్ట వేసి చక్రం తిప్పుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమంలో ఏకంగా అధికారి కుర్చీలోనే టీడీపీ నేతలు కూర్చొని సర్ డిజిటలైజేషన్ చేయిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ అధికారికి కేటాయించిన కుర్చీలో కూర్చొని వారి అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు. ఈ సంఘటన మంగళవారం చీరాల మండలంలోని తోటవారిపాలెం గ్రామ సచివాలయంలో చోటు చేసుకుంది. సర్ కార్యక్రమంలో బీఎల్వోలకు అనుసంధాన పార్టీ తరఫున ఏర్పాటు చేసి బీఎల్‌ఏలు, టీడీపీ నాయకులు బీఎల్‌ఓలతో కలిసి గ్రామ సచివాలయంలో ఓట్ల చేర్పు, తొలగింపు ప్రక్రియ చేస్తున్నట్లు సమాచారం. సర్ ప్రక్రియలో అనుకూలమైన ఓట్లు ఉంచుతున్నారు. ఇతర పార్టీల ఓట్లు తొలగిస్తున్నారని సమాచారం.


