పట్నంబజారు: ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాలు.. ఏప్రిల్ నెల 4వ తేదీన చౌత్రా డౌన్ గంజిబజార్‌లోని కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానంలో గుడి పూజారిని మాయ చేసి అమ్మవారి మెడలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఒక వ్యక్తి దోచుకుని పోయాడు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడుని గుర్తించారు. కృష్ణాజిల్లా విజయవాడ మాచవరానికి చెందిన ఏమని రాంబాబు ప్రస్తుతం హైదరాబాదులోని నేతాజీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఏప్రిల్ నాలుగో తేదీన విజయవాడ నుంచి స్కూటీపై గుంటూరుకు వచ్చి గంజి బజార్‌లోని కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానంలో పూజారి గుడి శుభ్రం చేస్తుండగా అమ్మవారికి దండం పెట్టుకున్నట్లు నటించి ఆయనకు రూ.500 నోటు ఇచ్చి 100 రూపాయలు దక్షిణ తీసుకుని మిగతావి తిరిగి ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో ఆలయ అర్చకుడు బయటకు వెళ్లిన సమయంలో అమ్మవారి బంగారు మంగళ సూత్రాలు, బొట్టు మొదలగు వెండి వస్తువులను అపహరించుకుపోయాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 70కి పైగా ఆలయాల్లో చోరీకి చేసినట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిని సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి అమ్మవారి ఆలయంలో చోరీకి పాల్పడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు.


