గుంటూరు మెడికల్ పార్కిన్సన్స్ వ్యాధి గతంలో 50 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే వచ్చేది. నేడు 40 ఏళ్లలోపు వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి సోకిన వారి జీవితం చాలా దుర్భరంగా తయారవుతోంది. ముఖ్యంగా కూర్చోలేరు, పడుకోలేరు, నడవలేరు. శరీరం వణికిపోవటం లేదా కాలు లేదా చేయి వణికిపోతూ ఉంటాయి. వణుకుడు రోగంగా ప్రాచుర్యంలో ఉన్న పార్కిన్సన్స్ డీసీజ్ను మొదటిసారిగా 1817లో డాక్టర్స్ జేమ్స్ పార్కిన్సన్ గుర్తించారు. ఈ వ్యాధిపై అవగాహన కోసం ప్రతి ఏడాది ఏప్రియల్ 11న వరల్డ్ పార్కిన్సన్స్ డీసీజ్ అవేర్నెస్ డే నిర్వహిస్తున్నారు. వ్యాధి గురించి తెలుసుకుని తగిన జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
కారణాలు ఇవీ...
పార్కిన్సన్స్ వ్యాధి మెదడులోని ఒక భాగంలోని నాడీ కణాలు క్షీణించటం వల్ల వస్తుంది. వృద్ధుల్లో డోపమిన్ లోపం వల్ల, యువకుల్లో జన్యుపరమైన కారణాలతో, కొన్ని రకాల పర్యావరణ పరిస్థితుల వల్ల, కొన్ని రకాల మందుల తీసుకోవటం వల్ల, పిల్లల్లో ఇతర జబ్బుల వల్ల వ్యాధి బారిన పడుతుంటారు. మెదడు అనారోగ్యంతో బాధపడే వారిలో, తలకు తీవ్ర గాయాలైన వారిలో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిలో వ్యాధి రావొచ్చు.
లక్షణాలు ఇలా...
శరీరంలోని ఏదో ఒక భాగం అంటే చేతులు లేదా కాళ్లు లేదా దవడపై భాగంలో వణుకుడు వస్తోంది. నడవలేరు, కదలలేరు, మంచంపై పడుకున్నా వణుకుడు ఉంటుంది. నడకకు ప్రయత్నించినప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోతారు. కండరాలు పట్టివేయటం, బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి. వస్తువులు కూడా పట్టుకోలేరు. వాసన చూడలేరు. మాట కూడా వణుకుతూ వస్తుంది. నిద్రకు ఆటంకాలు ఏర్పడతాయి. కొన్ని ప్రత్యేక సందర్భల్లో డిప్రెషన్, ఆహారం నమలటం, మింగటం కష్టంగా మారుతుంది. అలసట, మలబద్ధకం, చర్మ సమస్యలు, లైంగిక సమస్యలు, భయం, భ్రమలు, భ్రాంతులు, చొంగ కార్చుకోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


