రక్తమోడుతున్న రహదారులు | - | Sakshi
Sakshi News home page

రక్తమోడుతున్న రహదారులు

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

హెల్మెట్‌ ధరించకపోవడంతోనే...

మద్యం మత్తులో

అధిక ప్రమాదాలు...

గత వారం రోజులుగా జిల్లాలో వరుస ప్రమాదాలు

పది మంది మృత్యువాత... పాతిక మందికి గాయాలు

ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే భారీగా దుర్ఘటనలు

85 మంది మృతి.. మరో 149 మందికి గాయాలు

అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తులో డ్రైవింగే కారణం

బైకు నడిపే వారికి హెల్మెట్‌ లేక పెరుగుతున్న మరణాలు

పల్నాడు జిల్లాలో నిత్యం ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. క్షణకాలంలో జరిగిన ప్రమాదాల వల్ల పలువురు మృత్యువాత పడుతున్నారు. బాధిత కుటుంబాల్లోని వారు రోడ్డున పడుతున్నారు. ముఖ్యంగా కుటుంబాన్ని పోషిస్తున్నవారు మరణిస్తే మిగిలినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. దీంతోపాటు ఆర్థిక ఇబ్బందులు మొదలై జీవితాలు తలకిందులవుతున్నాయి.

సాక్షి, నరసరావుపేట : ఇంటి నుంచి అర కిలోమీటరులోపు రోడ్డుపై ఉన్న టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లి అల్పాహారం తీసుకురావడమేగా... అనుకొని హెల్మెట్‌ ధరించకుండా శావల్యాపురం మండలం కనమర్లపూడికి చెందిన 16 ఏళ్ల బాలుడు రవీంద్ర ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అనుకోని ప్రమాదంలో మినీ ట్రక్కు ఢీకొని గుంటూరు–కర్నూలు జాతీయ రహదారి మార్గంలో కనమర్లపూడి వద్ద సంఘటనా స్థలంలోనే మరణించాడు. నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ద్విచక్రవాహనం నడపకూడదు. కనీసం హెల్మెట్‌ కూడా ధరించకపోవడంతో చేతికందిన కొడుకును తల్లిదండ్రులు కోల్పోవాల్సి వచ్చింది. విధులకు వెళుతున్న ఓ కానిస్టేబుల్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారం రోజులుగా జిల్లాలో ప్రతి రోజు ఇలాంటి వార్తలు వినాల్సి వస్తోంది. హెల్మెట్‌ ధరించకపోవడం, అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్‌ వంటి కారణాలతో రోడ్లు రక్తమోడుతున్నాయి. గత వారం రోజుల్లో రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 10 మంది మృత్యువాత పడ్డారు. పాతిక మంది గాయాలపాలయ్యారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే పల్నాడు జిల్లాలో ఏకంగా 147 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 85 మంది మృతి చెందారు. మరో 149 మంది గాయాలపాలయ్యారు. ముఖ్యంగా గత వారం రోజులుగా నిత్యం ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. వినుకొండ నియోజకవర్గంలో ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. 2024తో పోల్చితే గత సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రుల సంఖ్య పెరిగింది.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ పెట్టుకోవాలని ఎంత అవగాహన కల్పిస్తున్నా వాహన చోదకుల్లో మార్పులు రావడం లేదు. కొన్నేళ్లుగా జరిగిన మొత్తం ప్రమాదాల్లో మూడోవంతు ద్విచక్ర వాహనదారులవే ఉన్నాయి. గత బుధవారం వెల్దుర్తి పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వెంకట్‌ నాయక్‌ ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో దాచేపల్లి వద్ద లారీని ఢీకొని తలకు తీవ్రగాయాలై మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పేది. గాయాలతో బయటపడే అవకాశం ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన పది మంది హెల్మెట్‌ ధరించకపోవడంతో జరిగినవే. ఇది ఎంత ప్రమాదకరమో ఈ సంఘటనల ద్వారా తెలుస్తోంది. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తు కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్ట పోలీసు, రవాణా శాఖ అధికారులు గుర్తించారు. రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. రహదారుల మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, సోలార్‌ బ్లింకర్లు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. అయినా ప్రమాదాలను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు.

వినుకొండ పట్టణ శివారులో అతివేగంతో వచ్చి లారీని ఢీకొట్టిన వాహనం (ఫైల్‌)

జిల్లాలో గత రెండు సంవత్సరాలలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రదేశాలు సుమారు 34 బ్లాక్‌ స్పాట్లు ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రదేశాలలో పోలీస్‌, రవాణా, నేషనల్‌ హైవేస్‌ మరియు ఆర్‌ అండ్‌ బీ శాఖలు సంయుక్త సర్వే నిర్వహించాయి. ప్రమాదాలు జరగడానికి గల కారణాలను అధికారులు విశ్లేషించారు. ఆయా బ్లాక్‌ స్పాట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రమాదాలకు గల కారణలను విశ్లేషిస్తున్నారు. జంక్షన్ల వద్ద వాహనదారులు వేగాన్ని నియంత్రించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణం. నార్క్‌ట్‌పల్లి – అద్దంకి హైవేలో రొంపిచర్ల, పొందుగుల, గురజాల రోడ్‌ జంక్షన్‌, గుంటూరు – పిడుగురాళ్ల రహదారిలో కంటిపూడి, పిడుగురాళ్ల మండలం కామేపల్లి, ముప్పాళ్ళ, గుంటూరు – శ్రీశైలం రోడ్‌లో అందుగలపాడు, రావిపాడు గ్రామాల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. వినుకొండ పరిసరాలలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆ సమయంలో వాహనదారులు మద్యం మత్తులో ఉండటం కూడా ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement