ఉరకండి..ఉరకండి
రైలు ఎక్కాలంటే పరుగు పెట్టాల్సిందే
నరసరావుపేట రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల ఇబ్బందులు అసంపూర్తిగా ప్లాట్‌ఫారమ్, ఏర్పాటు కాని కోచ్ ఇండికేటర్స్ నిత్యం ప్లాట్‌ఫారమ్‌కు దూరంగా నిలుస్తున్న పలు రైళ్లు
రద్దీగా రైళ్లు
నరసరావుపేట రూరల్: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట రైల్వేస్టేషన్‌లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు రాకపోకలతో పాటు ప్రయాణికుల సంఖ్య పెరిగినా అందుకు తగ్గట్టు సౌకర్యాలు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయాణికులు రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫారమ్ కూడా లేని పరిస్థితి. దీంతో పాటు కోచ్ ఇండికేషన్ బోర్డులు లేక రైలు ఎక్కాలంటే ట్రాక్ పక్కనే ఇరుకుగా ఉన్న దారిలో ప్రయాణికులు ఉరుకులు, పరుగులు తీయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. నరసరావుపేట నుంచి రైలు ప్రయాణికుల సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగింది. గుంటూరు–గుంతకల్లు మద్య డబ్లింగ్ పనులు పూర్తికావడం, సరైన సమయంలో రాకపోకలు సాగిస్తుండటంతో రైలులో ప్రయాణించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. గుంటూరు– తిరుపతి మధ్య ఏర్పాటు చేసిన ఎక్స్‌ప్రెస్ రైలుతో నరసరావుపేట రైల్వేస్టేషన్ నిత్యం రద్దీగా మారింది. నరసరావుపేట మీదుగా ప్రతి రోజు 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లుతో పాటు వారంలో కొన్ని రోజులపాటు నడిచే రైళ్లు ప్రయాణిస్తున్నాయి.
రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం స్టేషన్‌లో అనేక పనులు జరుగుతున్నాయి. రెండవ నెంబరు ప్లాట్‌ఫారమ్ నిర్మాణ పనులు పూర్తిచేయాల్సి ఉంది. ప్రయాణికుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే కోచ్ ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు.
– సయ్యద్ బాజాన్,
స్టేషన్‌మాస్టర్, నరసరావుపేట
నరసరావుపేట మీదుగా నడిచే రైళ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంటుంది. తెనాలి– మార్కాపురం డేమో రైలు ప్రతి రోజు నడుపుతున్నారు. స్థానికంగా రాకపోకలు సాగించే వారికి ఇదే చాల ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో పాటు గుంటూరు–ఔరంగాబాద్, గుంటూరు–డోన్, విజయవాడ–హుబ్లీ, గుంటూరు–తిరుపతి, గుంటూరు–కాచిగూడ, మచిలీపట్నం–యశ్వంత్‌పూర్(కొండవీడు ఎక్స్‌ప్రెస్), హోరా–వాస్కోడిగామా(అమరావతి ఎక్స్‌ప్రెస్), భవనేశ్వర్–బెంగళూరు, నర్సాపూర్–ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌లు ఈ మార్గంలో నిత్యం రాకపోలు సాగిస్తున్నాయి. వీటితో పాటు వారంలో ఒక రోజు ప్రయాణించే మరో ఐదు రైళ్లు ఉన్నాయి. నరసరావుపేట నుంచి బెంగళూరు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు నరసరావుపేట కేంద్రంగా మారింది. ఇక్కడ నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు.


