శతాబ్ది వేడుకలకు ముస్తాబు
చదువులకు కేరాఫ్ కొండవీటి కమిటీ పాఠశాల 11న పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో శత వసంత ఉత్సవాలు
చేబ్రోలు: ఇక్కడ విద్యాబుద్ధులను నేర్చుకొన్న ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. మరికొందరు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అదే చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ విద్యాభివర్థని సంఘం, కేసీ స్కూల్స్ ప్రత్యేకత. ఈ నెల 11వ తేదీన శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్నది. శత వసంత ఉత్సవాలకు సిద్ధమవుతున్న కొండవీటి కమిటీ పాఠశాలకు ఘన చరిత్ర ఉంది.
అవతరణ ఇలా...
శ్రీ విద్యాభివర్థని సంఘాన్ని మొదట తొమ్మిది మంది గ్రామపెద్దలతో గాదె హనుమారెడ్డి ప్రదానోపాధ్యాయులుగా 1925 డిసెంబర్17వ తేదీన ఏర్పాటు చేశారు. అలెగ్జాండ్రియా హిందూ హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్‌గా 1925 డిసెంబర్ 25వ తేదీన ప్రాథమిక పాఠశాల స్థాపించారు. 1930లో మల్లాది గౌరీనాథశాస్త్రి హెచ్‌ఎంగా వ్యవహరించారు. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో మంత్రి బెజవాడ గోపాలరెడ్డి పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ శిలాఫలకం నేటికీ ఉంది. 1941లో 26 మంది సభ్యులతో ఈ సంఘం రిజిస్టర్‌బాడీగా ఏర్పాటైంది. 1954 సెప్టెంబర్ 19వ తేదీ నుంచి కొండవీటి కమిటీ ప్రాథమిక పాఠశాలగా మార్చారు. సమరయోధుడు కొత్తరెడ్డిపాలెంకు చెందిన గాదె చిన్నప్పరెడ్డి ౖసైసెరా చిన్నప్పరెడ్డిగా పేరుగాంచారు. వీరి వంశస్థులు ఇప్పటికీ కరస్పాండెంట్‌లుగా కొనసాగుతున్నారు. తర్వాత రెండు పాఠశాలలను నిర్వహించటం ప్రారంభించారు.
జాతీయస్థాయిలో గుర్తింపు
చల్లా రామకృష్ణారెడ్డి కరస్పాండెంట్‌గా ఉన్న కాలంలో సుమారు 14 ఎకరాలను ఆటస్థలానికి సమకూర్చారు. 1960– 78 మధ్య ఆయన హెచ్‌ఎంగా ఉన్న కాలంలో పాఠశాలకు మంచి గుర్తింపు వచ్చింది. 1975లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థులు ఎంపిక అయ్యారు. తరగతి గదులను మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు పలువురు వాలీబాల్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధించారు. పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన డిజిటల్ రూం, అందులో అమర్చబడిన డిజిటల్ పరికరాలను ముఖ్య అతిథులు ప్రారంభించనున్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ప్రభుత్వ పరీక్షల కార్యాలయం రిటైర్డు డైరక్టర్ ఆర్ సురేందర్‌రెడ్డిలు సావనీర్ ఆవిష్కరించున్నారు.
శతాబ్ది వేడుకలకు ముస్తాబు


