రబీ సీజన్‌కు సరిపడా యూరియా
జేడీఏ పద్మావతి
కొరిటెపాడు(గుంటూరు): రబీ సీజన్‌లో గుంటూరు జిల్లాలో అన్ని పంటలకు 55,840 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఎం.ద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల చివరి నాటికి జిల్లాకు 39,422 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికే 44,127 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఈ నెల చివరి నాటికి మరో 8,727 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు తెలిపారు. రాబోయే 21 రోజులకుగాను 11,075 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 12,905 మెట్రిక్ టన్నుల యూరియాను సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు, మార్కెటింగ్ గోదాములు, రిటైల్, హోల్‌సేల్ కంపెనీ గోదాముల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రబీ సీజన్‌లో ఇప్పటికే 31,056 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు విక్రయించినట్లు పేర్కొన్నారు.
ఈ–పంట నమోదు వేగవంతం చేయాలి
ఈ–క్రాప్ నమోదు వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఎం.పద్మావతి ఆదేశించారు. స్థానిక కృషి భవన్‌లో ఏర్పాటు చేసిన గుంటూరు సబ్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల గ్రామ వ్యవసాయ అధికారుల(వీఏఓ)కు శుక్రవారం శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పీఎం కిసాన్ పథకంలో ఉన్న లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. నిత్యం రైతులతో సంబంధాలు ఏర్పరచుకొని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. లాం ఫారం శాస్త్రవేత్త డాక్టర్ వెంకట్రావు రబీ పంటలైన మొక్కజొన్న, శనగ, జొన్న పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి, రైతులు అధిక దిగుబడులు సాధించేలా చూడాలని కోరారు. అధిక ఎరువులు వాడటం వల్ల భూమి సారవంతం కోల్పోవడంతో పాటు, చీడపీడలు ఏర్పడతాయన్నారు. గుంటూరు ఏడీఏ ఎన్.మోహన్‌రావు మాట్లాడుతూ రైతులు సాగు చేసిన ప్రతి పంటను విధిగా ఈ–పంటలో నమోదు చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం ఆదేశాల మేరకు యూరియా బస్తా రూ.266.50లకు మాత్రమే విక్రయించేటట్లు చూడాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు రూరల్ ఏవో బి.కిషోర్, ఫిరంగిపురం ఏఓ జె.వాసంతి, పెదకాకాని ఏఓ రమణ కుమార్, మేడికొండూరు ఏఓ లక్ష్మి, పత్తిపాడు ఏఓ సుగుణ బేగం, వట్టిచెరుకూరు ఏఓ సునీత, ఏడు మండలాల ఎంఈఓలు, వీఏఓలు, వీహెచ్‌ఓలు పాల్గొన్నారు.


