ఆండళక్కుం మెయ్యన్ అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: పట్టణంలోని రైల్వేస్టేషన్‌రోడ్‌లో గల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీవారిని ఆండళక్కుం మెయ్యన్‌గా అలంకరించి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు ఆలయ ప్రధాన అర్చకుడు చిత్రకవి శ్యాము ఆచార్యులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆండళక్కుం మెయ్యన్ అంటే ‘ఆండాళ్ (గోదాదేవి)కి మెయ్యన్’ అని అర్ధమన్నారు. నిజమైన (ప్రియమైన) వాడని అర్థమని, ఇది విష్ణువును సూచిస్తుందన్నారు. ఇది తమిళనాడులోని తిరువాదనూర్‌లో ఉన్న ఒక ముఖ్యమైన వైష్ణవ దేవాలయం అని, ఈ ఆలయంలోని ప్రధాన దైవమే ఆండళక్కుం మెయ్యన్ అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా శ్రీవారి సేవకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అమరావతి: అమరేశ్వరాలయంలోని దేవుడి సొమ్ముపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ అమరావతి మండల అధ్యక్షుడు మేకల వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం అయన మాట్లాడుతూ ఇటీవల పత్రికల్లో వస్తున్న అవినీతి వార్తలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పాలకమండలి సభ్యులే అవినీతి జరిగిందని ఆరోపించినా కనీసం విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించకపోవటంపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దేవదాయశాఖ ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ డిమాండ్ చేస్తుందన్నారు. అవినీతిపై దేవదాయశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోతే విశ్వహిందూ పరిషత్ లీగల్‌సెల్ తరఫున న్యాయపోరాటం చేస్తామని వీహెచ్‌పీ మండల లీగల్‌సెల్ అధ్యక్షులు బి.సుబ్బారావు అన్నారు.
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామికి, శనివారం పండ్లతో ప్రత్యేక అలంకరణ, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిలకు నిజరూపదర్శన అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారి పాదాలను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
గుంటూరురూరల్: రెడ్డి కళాశాల సమీపంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సరస్(అఖిలభారత డ్వాక్రా బజార్) మేళాలో స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలుగా మారటానికి అవసరమైన నైపుణ్యాలపై యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఈటీఐ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉచిత వసతి భోజన సౌకర్యాలతో అందించే వివిధ రకాల స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను తెలియజేశారు.
ఆండళక్కుం మెయ్యన్ అలంకరణలో శ్రీవారు
ఆండళక్కుం మెయ్యన్ అలంకరణలో శ్రీవారు


