మళ్లీ ప్రారంభోత్సవాలా!
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి టీడీపీ నాయకుల తీరుపై మండిపాటు
పిడుగురాళ్ల: మేము ప్రారంభోత్సవాలు చేసిన వాటికి రంగులు వేసి మరలా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభోత్సవాలు చేయటం ఏమిటని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు. సెల్ఫీ వీడియోలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ...20 ఏళ్ల కిందట వరకు పిడుగురాళ్ల ఒక గ్రామం, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిని పట్టణం చేశారని తెలిపారు. 2006, 2007 నుంచి 2019 వరకు కనీసం ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చారని, జానపాడు రోడ్డు బ్రిడ్జి మంజూరు చేయించి పనులు ప్రారంభించామని, బైపాస్ రోడ్డు పూర్తి చేశామని, సొంత ఇళ్లు లేని వేలాది మందికి ఇళ్ల పట్టాలు అందజేశామన్నారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీకి సొంత భవనం ఉండాలనే లక్ష్యంతో రూ.20, 25 కోట్ల విలువ చేసే స్థలాన్ని సేకరించి, కోటి రూపాయలతో భవన నిర్మాణం కూడా పూర్తి చేశామని, ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, యరపతినేని శ్రీనివాసరావు కొత్తగా భవనం కట్టలేదని, ఉన్న దానికి రంగులు వేసి మున్సిపల్ మంత్రితో ప్రారంభోత్సవం చేయించేందుకు సిగ్గు ఉండాలన్నారు. పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల పట్టణాలకు సుమారు రూ.150, 200 కోట్లతో తాగునీటి పథకాలు తీసుకొని వచ్చామని తెలిపారు. పిడుగురాళ్ల పట్టణానికి కృష్ణా జలాలు అందజేశామన్నారు. గురజాలలో పనులు ప్రారంభమయ్యాయని, దాచేపల్లిలో టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. మరలా వాటికి శంకుస్థాపన చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు. మేము తెచ్చినవి కాకుండా కొత్తగా ఏమైనా తెచ్చారా అంటే అది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. మేము శంకుస్థాపన చేసినవి, మేము ప్రారంభోత్సవం చేసిన వాటికి రంగులు వేసి ప్రారంభోత్సవాలు చేయటం గొప్పకాదని ఆయన పేర్కొన్నారు.


