హరికి దాసులై .. సంస్కృతికి సారథులై
జిల్లా వ్యాప్తంగా హరిదాసుల సందడి సంక్రాంతిలో వీరి ‘పాత్రే’ ప్రాధాన్యం
పూర్వకాలం నుంచి కొనసాగిస్తున్నాం...
సత్తెనపల్లి: ధనుర్మాసం అంటేనే తెలుగువారి పండుగలకు ఆహ్వానం పలికే మాసం. దీనికి ప్రతీకగా పట్టణాల్లో, పల్లెల్లో హరిదాసుల సందడి ఉంటుంది. గలగల గజ్జెల చప్పుడు, అలరించే హరినామ సంకీర్తనలతో గ్రామాలకు సంక్రాంతి శోభ తెచ్చింది. శిరస్సుపై అక్షయపాత్ర ధరించి ఒక చేత్తో వీణ, మరో చేత్తో చిడతలు వాయిస్తూ హరినామ సంకీర్తనలను ఆలపిస్తూ సంచరించే హరిదాసులు మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలు. వారి గానం వినిపిస్తే చాలు ప్రతి ఇంటి ముందు అతివలు బియ్యం, పండ్లు, పూలతో వేచి ఉంటారు. హరిదాసు వస్తే శిరస్సుపై ధరించిన అక్షయపాత్రలో ఆ బియ్యం పోసి సాక్షాత్తు ఆ నారాయణుడే తమ ఇంటికి వచ్చినట్లు భావించి చేతులు జోడించి నమస్క రిస్తారు. ఇదంతా ధనుర్మాసం ప్రారంభం నుంచి ప్రతి గ్రామంలో 33 రోజులపాటు కొనసాగుతోంది. సంస్కృతీ సంప్రదాయాలను ఇనుముడింపజేసే వారి వెనుక పడే కష్టం పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కేవలం 33 రోజులు ఇలా హరిదాసులుగా తిరిగే వీరు మిగిలిన 11 నెలలపాటు సామాన్యుల్లా కాయకష్టం చేసి కడుపు నింపుకుంటారు. మోయలేని భారమైనా తరతరాల నుంచి వస్తున్న సంప్రదా యాలను కొనసాగించాలనే పట్టుదలే వీరిని హరిదాసులుగా కొనసాగిస్తుందనడంలో సందేహం లేదు. జిల్లాలో వంద మందికి పైగా హరిదాసులు పర్యటిస్తున్నారు. సత్తెనపల్లి మండలం కట్టావారిపాలెం, ముప్పాళ్ళ, రాజుపాలెం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన వారే హరిదాసులుగా కొనసాగుతున్నారు.
అక్షయపాత్రదే ప్రథమ స్థానం..
కలశం లేదా అక్షయపాత్రగా పిలిచే ఆ పాత్రకు ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తారు. ఈ పాత్రలో భిక్ష వేయడం ద్వారా నారాయణుడికి నైవేద్యం సమర్పించినట్లు భక్తులు భావిస్తారు. అదీ ధనుర్మాసంలో హరికి కొత్తగా పండిన ధాన్యాలు సమర్పించడం ద్వారా పాడిపంటలు అభివృద్ధి చెందాలని భక్తులు కోరుకుంటారు.
నేను వారసత్వంగా మా తాతల కాలం నుంచి 20 ఏళ్లుగా హరిదాసుగా తిరుగుతున్నా. శ్రీమద్మారామణ గోవిందా హరి అనే హరినామమే మాకు ప్రాణం. విష్ణుమూర్తి స్వరూ పమైన హరికి దాసులుగా కొనసాగడం వల్లే మేము హరిదాసులుగా పేరు పొందాం. హరికి ప్రీతిపాత్రమైన ధనుర్మాసం, మాఘమాసంలో హరినామ సంకీర్తనలను ప్రసరింప చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి మా సంకీర్తన ప్రారంభ మవుతుంది. ఇలా 33 రోజులు హరికి దాసులుగానే జీవిస్తాం. గ్రామాల్లో కొంత మార్పు వచ్చినా ఆదరణ బాగుంది.
– పెరుమాళ్లపల్లి రామాంజనేయులు,
కట్టావారిపాలెం, పల్నాడు జిల్లా
హరికి దాసులై .. సంస్కృతికి సారథులై


