హత్యాయత్నం కేసులో జైలు శిక్ష
చీరాల రూరల్: హత్యాయత్నం కేసులో నిందితునిపై ఉన్న నేరారోపణలు రుజువు కావడంతో శుక్రవారం న్యాయమూర్తి ముద్దాయికి శిక్షతో పాటు జరిమానా విధించినట్లు ఈపురుపాలెం ఎస్సై చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఈపురుపాలెం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ అనేవ్యక్తిని అదే గ్రామానికి చెందిన షేక్ వధూద్ అనేవ్యక్తి 17 జనవరి 2020న ఎన్నికల విషయమై మాట్లాడుతూ పాత గొడవలు మనసులో పెట్టుకుని తలవెనుక భాగంలో కూల్‌డ్రింగ్ సీసాతో కొట్టి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో బాధితుడు మస్తాన్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. సుధ కేసును క్షుణ్ణంగా విచారించారు. నిందితునిపై ఉన్న నేరారోపణలను పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు కానిస్టేబుల్ కుమార్ రాజాలు సాక్షుల ద్వారా నిరూపించారు. దీంతో నిందితునిపై ఉన్న నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి ఏడాదిపాటు సాధారణ శిక్షతో పాటు రూ. 1,000 జరిమానా విధించారు. సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టి నిందితునికి శిక్ష పడేటట్లు చేసిన కోర్టు కానిస్టేబుల్ కుమార్ రాజాను ఎస్పీ జి. ఉమా మహేశ్వర్ అభినందంచినట్లు ఎస్సై తెలిపారు.


