ఏఎన్‌యూలో ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం
ఏఎన్‌యూ(పెదకాకాని): ఇండోనేషియాకు చెందిన నేషనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఏజెన్సీ(బీఆర్‌ఐఎన్) లోని రీసెర్చ్ సెంటర్ ఫర్ బయోమాస్–బయోప్రొడక్ట్స్‌కు చెందిన ప్రొఫెసర్ విద్యా ఫాత్రియాసారి, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, అమరావతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్.రంగభాసియం శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధరరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీలో వ్యర్థాల నిర్వహణ (వేస్ట్ మేనేజ్ మెంట్) విధానాలు, బయోవ్యర్థ పదార్థాల సమర్థ వినియోగం, వాటి ద్వారా విలువైన ఉత్పత్తుల తయారీ వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. బయోవ్యర్థాలను సుస్థిరంగా వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక విలువను ఎలా సృష్టించవచ్చో ఈ చర్చలో ప్రధానంగా ప్రస్తావించారు. అనంతరం అతిథి బృందం ఎంఎస్సీ ఫారెస్ట్రీ విభాగం సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఎం.ఎస్సీ ఫారెస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ కె. మల్లికార్జున సమన్వయంతో నిర్వహించారు.


