సేవలు..ఢమాల్..!
సమయపాలన పాటించని కొందరు సిబ్బంది
సర్వేలకే పరిమితమవుతున్న ఉద్యోగులు
క్షేత్రస్థాయిలో సేవలు అందక ప్రజల అవస్థలు
చంద్రబాబు పాలనలో సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం
ఇదీ జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దుస్థితి
సత్తెనపల్లి: ప్రజల ముంగిటకే పరిపాలన చేరువ చేయాలనే సంకల్పంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సచివాలయ వ్యవస్థ, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో నిర్వీర్యమవుతోంది. సచివాలయాల్లో ప్రజలకు అవసరమైన సుమారు 400 రకాలకు పైగా సేవలు గతంలో అందేవి. సుమారు 10 విభాగాల సిబ్బంది అందుబాటులో ఉండేవారు. వేలాదిమందికి ఈ వ్యవస్థ ఆవిర్భావంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగాలు కల్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. నాడు కళకళలాడిన గ్రామ, వార్డు సచివాలయాలు నేడు వెలవెలబోతున్నాయి.
జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు చంద్రబాబు పాలనలో నిర్వీర్యం అయ్యాయి. సచివాలయ ఉద్యోగులను బాబు సర్కార్ చులకన భావనతో చూడటమే కాక వారిపై అధిక పని ఒత్తిడి పెడుతోంది. గ్రామాల్లో వివిధ సమస్యల పరిష్కారానికి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళుతున్న ప్రజలకు న్యాయం జరగడం లేదు. ప్రజలు సచివాలయాలకు ఏ సమయంలో వెళ్లినా ఉద్యోగులు ఫీల్డ్‌కు వెళ్లారనే సమాధానం వస్తోంది. సచివాలయాల్లో నిబంధనల మేరకు ఉండాల్సిన ఉద్యోగుల్లో 80 శాతం మందికి పైగా క్షేత్రస్థాయి సర్వేలు, డిప్యుటేషన్లు, అనుబంధ శాఖల పనుల్లో నిమగ్నం అవుతు న్నారు. ఉన్న వారిలో కొంత మంది మాత్రమే చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలోని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 416 గ్రామసచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 122 వార్డు సచివాలయాలు ఉన్నాయి. గ్రామ,వార్డు సచివాలయాల్లో 4,518 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో ఉద్యోగులు హాజరైన దాఖలాలు కనిపించడం లేదు.
సేవలు..ఢమాల్..!


