కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు
చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
సంయుక్త బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాలి
గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు
నరసరావుపేట: కోడి పందేలు నిర్వహించే వారిపై జంతు హింస నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు హెచ్చరించారు. సంక్రాంతి పర్వదినం సందర్బంగా కోడి పందేలు నివారణపై శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోడి పందేలు జరిగే అవకాశాలు ఉన్న ప్రదేశాలను గుర్తించాలన్నారు. శనివారం అన్ని గ్రామాల్లో దండోరా వేయించాలని ఆదేశించారు. గత ఏడాది నమోదైన కేసులు, చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నారు. మండల స్థాయి కమిటీలను వెంటనే రెవెన్యూ, పోలీస్, పశు సంవర్థక శాఖ, పంచాయతీరాజ్ శాఖలతో ఏర్పాటు చేయాలన్నారు. అన్నీ గ్రామాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని సూచించారు. పందేలు నిర్వహించే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. చట్టప్రకారం చర్యలు చేపట్టి, బైండోవర్ చేయాలని పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు.
పండుగ వాతావరణంలో గణతంత్ర వేడుకలు
జనవరి 26వ తేదీన నిర్వహించే గణతంత్ర వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలకు సకాలంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు ఎదురు కాకుండా చూసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులు, ప్రజల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్‌ఓ ఏకా మురళి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పాసు పుస్తకాల పంపిణీ 11వ తేదీలోపు పూర్తి చేయాలి
జిల్లాలోని అన్ని గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు 11వ తేదీలోపు పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలను ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న రెవెన్యూ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


