వైభవంగా ఉరుసు మహోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఉరుసు మహోత్సవాలు

Jan 9 2026 7:23 AM | Updated on Jan 9 2026 7:23 AM

వైభవం

వైభవంగా ఉరుసు మహోత్సవాలు

వైభవంగా ఉరుసు మహోత్సవాలు ముగిసిన శ్రీత్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలు నో ప్లాస్టిక్‌ జోన్‌ గా పక్షి సంరక్షణ కేంద్రం

నగరంపాలెం: స్థానిక జీటీరోడ్డులో శ్రీహాజరత్‌ కాలే మస్తాన్‌ షా ఆవులియా 134వ ఉరుసు మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం బాబా సమాధి ప్రత్యేకంగా అలకరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. రాత్రికి గ్యార్మీ షరీఫ్‌ (ఖురాన్‌ పఠనం) చేపట్టారు. కార్యక్రమాలను ధర్మకర్త రావి రామ్మోహరావు పర్యవేక్షించారు.

నగరంపాలెం: స్థానిక లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ కళావేదికపై నిర్వహిస్తోన్న శ్రీత్యాగరాజస్వామి 179వ ఆరాధన సంగీత మహోత్సవాలు గురువారం ముగిశాయి. శ్రీత్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరగ్గా, తొలుత శ్రీ త్యాగరాజస్వామికి శ్రీకాంత్‌ బృందంచే నాదస్వరం, ఉంఛవత్తి, పంచామృతాభిషే కార్చన, విశేష అలంకరణతో ప్రారంభించారు. శ్రీత్యాగరాజ స్వామిని పల్లకీలో కళాకారులు, సంగీతజ్ఞులు, ఔత్సాహికులు శ్రీత్యాగరాజ పంచరత్న కీర్తనల గానంతో తిరు వీధులలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక, స్థానికేతర కళాకారులతో పంచరత్న సేవ విశేష హారతి, అన్న ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం నాట్యాచార్య డాక్టర్‌ కాజా వెంకటసుబ్రహ్మణ్యం శిష్య బృందం చే ప్రహ్లాద భక్తి విజయం నృత్య రూపకం ప్రదర్శించారు. దేవదాయశాఖ గౌరవ సలహాదారులు బ్రహ్మశ్రీ చుండూరి సీతారామాంజనేయప్రసాద్‌, ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్‌ వేదాంతం రాజగోపాల చక్రవర్తి హాజరై, త్యాగరాజ స్వామి విశిష్టతను వివరించారు. చిన్నారులను ప్రశంసించారు. సంఘం కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్‌, ఉపాధ్యక్షులు ఎస్‌.గిరిజాశంకర్‌, కోశాధికారి రవీంద్రనాధ్‌, సలహాదారు నేతి విశ్వేశ్వరరావు పాల్గొనగా, అతిధులను, కళాకారులను సత్కరించారు.

శిశువుల అక్రమ విక్రయాల్లో 30కి చేరిన అరెస్ట్‌లు

లబ్బీపేట(విజయవాడతూర్పు): శిశువుల అక్రమ విక్రయాల కేసుల్లో ఇప్పటి వరకూ 30 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు నగర డిప్యూటీ కమిషనర్‌ కృష్ణకాంత్‌ పటేల్‌ తెలిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శిశువుల కిడ్నాప్‌ అమ్మకం కేసులకు సంబంధించి పోక్సో యాక్ట్‌ , మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అహ్మదాబాద్‌, గుజరాత్‌, ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లో టీములు ఈ రాకెట్‌మూలాలను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ ఫెర్టిలిటి సెంటర్స్‌ ప్రమేయం ఎంతవరకు ఉంది.. నిజంగా పిల్లల కిడ్నాప్‌ చేశారా లేదంటే తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పిల్లలను ఈ రకమైన అమ్మకానికి పెడుతున్నారా అనే అంశాలను విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

పెదకాకాని: నో ప్లాస్టిక్‌ జోన్‌గా ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు సహకరించాలని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్‌ ఎం.డి.నజీనా బేగం అన్నారు. ప్లాస్టిక్‌ రహిత ప్రాంతంగా (నో ప్లాస్టిక్‌ జోన్‌)గా మార్చే ఉద్దేశంతో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం ఉప్పలపాడు పక్షుల కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పక్షి సంరక్షణ కేంద్రంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్స్‌ వినియోగాన్ని నిషేధించి, పూర్తిగా ప్లాస్టిక్‌ రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు డీఎఫ్‌ఓకు సూచనలు జారీ చేశారు. పక్షి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించే వారికి ఎలాంటి ప్లాస్టిక్‌ వస్తువులను లోపలికి తీసుకురావద్దని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే హానికర ప్రభావాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి కె శ్రీనివాసరావు, పర్యాటకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

వైభవంగా ఉరుసు మహోత్సవాలు  
1
1/2

వైభవంగా ఉరుసు మహోత్సవాలు

వైభవంగా ఉరుసు మహోత్సవాలు  
2
2/2

వైభవంగా ఉరుసు మహోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement