ఖాతా ఇస్తే కటకటాలే!
పేదలే లక్ష్యంగా సైబర్ నేరస్తుల పన్నాగాలు బ్యాంక్ ఖాతా తీసుకొని బెట్టింగ్ మాఫియా కమీషన్ ఆశపడి నగదు ఉపసంహరణకు ఖాతాదారుల అంగీకారం భారీ నగదు లావాదేవీలతో ఐటీ నుంచి నోటీసులు అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటున్న అమాయకులు మ్యూల్ ఖాతాల ఏజెంట్‌గా మారిన సత్తెనపల్లి యువకుడు కేసు దర్యాప్తు చేస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
కొద్దిపాటి కమీషన్ కోసం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఎందరో విలవిల
సాక్షి, నరసరావుపేట: సత్తెనపల్లికి చెందిన నరేష్ అనే యువకుడు ఓ మెడికల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. గతంలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నప్పుడు ఉన్న బ్యాంక్ కరెంట్ అకౌంట్‌ను అదే పట్టణానికి చెందిన సుల్తాన్ అనే వ్యక్తి అడగడంతో వివరాలు ఇచ్చాడు. నిజామాబాద్‌కు చెందిన ఓ బిల్డర్ తన వద్ద సైబర్ నేరగాళ్లు రూ.4.65 లక్షలు కాజేశారని ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నరేష్‌ను గతేడాది నవంబర్ 3వ తేదీన అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఇప్పటివరకు బెయిల్ రాలేదు. విషయం ఏంటని కుటుంబ సభ్యులు ఆరా తీస్తే నరేష్ బ్యాంక్ ఖాతాలో రూ.లక్షలు జమ కావడం, ఆపై చైన్నెకి చెందిన సైబర్ నేరగాళ్లు ఆ మొత్తాన్ని వేరే ఖాతాలకు మళ్లించడమేనని తెలిసింది. నరేష్‌కు కమీషన్ ముట్టజెప్పారని పోలీసులు చెబుతున్నారు. కమీషన్‌కు ఆశపడి బ్యాంక్ ఖాతా ఇచ్చిన నరేష్ ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. ఇలా చాలామంది తెలిసీతెలియక సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి జైలు పాలవుతున్నారు.
తొలి అరెస్టు వారిదే...
సైబర్ నేరగాళ్లు, బెట్టింగ్ మాఫియా.. చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ వంటి దేశాలలో మకాం వేసి మన ప్రజల డబ్బులను దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరిట టార్గెట్ చేసి రూ.లక్షలు దండుకుంటున్నారు. బెట్టింగ్ ఊబిలోకి దింపి సర్వం కోల్పోయేలా చేస్తున్నారు. ఈ డబ్బులను బాధితుల నుంచి తీసుకోవడానికి నేరగాళ్లకు కొన్ని బ్యాంక్ ఖాతాలు అవసరమవుతున్నాయి. దీంతో పేదరికంలో ఉన్న, ఈజీ మనీ కోసం ఆశపడే వారిని టార్గెట్ చేసుకొని వారి బ్యాంక్ ఖాతాలను సేకరిస్తున్నారు. సైబర్ బాధితుల నుంచి నగదు వాటిలో జమ చేయించుకొని వేరే ఖాతాలకు ఉపసంహరించుకోవడం లేదా బిట్‌కాయిన్స్ రూపంలోకి మార్చుకుంటన్నారు. ఈ క్రమంలో బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు తొలుత బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన వారి వివరాలు లభిస్తున్నాయి. దీంతో వారినే తొలుత అరెస్టు చేస్తున్నారు.
న్యాయపరమైన చిక్కుల్లో...
ఈజీ మనీకి ఆశపడి బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చినవారు న్యాయపరమైన చిక్కులతో ఇబ్బందులకు గురవుతున్నారు. సైబర్ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో వీరినే మొదటి నిందితులుగా చేరుస్తున్నారు. దీంతో పలువురు జైలు పాలయ్యారు. మరోవైపు భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరుగుతుండటం, విదేశీ ఖాతాలతో లావాదేవీలు నడుపుతుండటంతో ఖాతాదారులకు ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందుతున్నాయి. దీంతో అప్పటివరకు వస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులవుతున్నారు. ఇతరుల ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్ ఖాతాలను అప్పగించి ఇబ్బందులకు గురికావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులోపడి జైలుపాలు కావొద్దని హెచ్చరిస్తున్నారు.
కమీషన్ ఆశ చూపి సైబర్ నేరగాళ్లు పెద్ద ఉచ్చులోకి సామాన్యులనూ లాగుతున్నారు. తెలిసీ తెలియక చాలామంది కమీషన్ వస్తుందన్న ఆశతో వారికి బ్యాంకు ఖాతాలను అప్పగిస్తున్నారు. పోలీసులు ఏదైనా నేరం జరిగినప్పుడు తీగ లాగితే డొంక కదులుతోంది. తొలుత ఖాతాదారుడిని అరెస్టు చేస్తున్నారు.


