● ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహణ ● అధికారుల క్షేత్రస్థా
‘చారిత్రక కొండవీడు ఫెస్ట్–2026’ కు ఏర్పాట్లు
యడ్లపాడు: చారిత్రక వారసత్వానికి నెలవైన కొండవీడు కోటపై ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించనున్న ‘కొండవీడు ఫెస్ట్–2026’ ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభమైంది. గురువారం వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు కొండవీడుకోటను సందర్శించి, ఉత్సవాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రాథమిక పరిశీలన జరిపారు. ఉత్సవాలకు వచ్చే వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేలా చేపట్టాల్సిన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తీరుపై చర్చించారు. రవాణా సౌకర్యాలు, వేదికల ఏర్పాటు, పర్యాటకుల భద్రత వంటి అంశాలపై అధికారులు చర్చించారు. గత ఉత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మెరుగైన వసతులు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్లు అధికారులు వివరించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో అన్ని శాఖల అధికారులతో కలిసి తుది పరిశీలన ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్శనలో ఆర్డీవో మధులత, డీఎంహెచ్‌వో డాక్టర్ రవి, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీధర్, ఆర్టీసీ ఆర్‌ఎం అజిత కుమారి, టూరిజం మేనేజర్ గంగిరెడ్డి నాయుడమ్మ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమణమ్మ, తహసీల్దార్ విజయశ్రీ, ఎంపీడీవో హేమలతాదేవి, తదితరులు పాల్గొన్నారు.


