సంక్షేమం మరిచిన చంద్రబాబు ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం మరిచిన చంద్రబాబు ప్రభుత్వం

Jan 9 2026 7:23 AM | Updated on Jan 9 2026 7:23 AM

సంక్షేమం మరిచిన చంద్రబాబు ప్రభుత్వం

సంక్షేమం మరిచిన చంద్రబాబు ప్రభుత్వం

రాష్ట్రంలో పూర్తిగా కుంటుపడిన అభివృద్ధి రాజధాని కావాలన్న రైతులే నేడు వ్యతిరేకం ఆర్యవైశ్యులపై రాష్ట్ర సర్కారు చిన్నచూపు పొట్టిశ్రీరాములు విగ్రహం పెట్టడానికి చందాలా? మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ధ్వజం

పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టలేరా?

సత్తెనపల్లి: రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. ధనుర్మాసం సందర్భంగా సత్తెనపల్లిలోని అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో కోటి దీపోత్సవానికి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డితో కలిసి గురువారం వెల్లంపల్లి హాజరయ్యారు. అనంతరం ఆర్యవైశ్య నాయకుడు తల్లం సతీష్‌ గృహంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏ వ్యాపారం సాగే పరిస్థితి లేదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల కోట్ల వరకు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు అందేవని చెప్పారు. ఆ నగదుతో కొనుగోళ్లు పెరిగి వ్యాపారాలు అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.3 లక్షల కోట్లు అప్పులు చేసి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదన్నారు. కనీసం అభివృద్ధి కూడా మచ్చుకై నా కనిపించడం లేదని తెలిపారు. అమరావతి రాజధాని అని చెబుతున్నారే తప్ప, రాజధాని కావాలన్న రైతులు ఈ రోజు ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో సోషల్‌ మీడియా, వివిధ మాధ్యమాల ద్వారా చూస్తున్నామని గుర్తుచేశారు.

అడ్డగోలుగా దాడులు

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యులపై దాడులు పెరిగాయన్నారు. విజయవాడలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీరామ్‌ప్రసాద్‌ను నడిరోడ్డు మీద చంపేస్తే అతీగతీ లేదన్నారు. పొదిలిలో ఆర్యవైశ్య సోదరుడు అవినాష్‌ను, ఆయన తండ్రి కోటేశ్వరరావులను ఎస్‌ఐ కొడితే కంటితుడుపు చర్యగా వీఆర్‌కు పంపారన్నారు. దర్శిలో రేషన్‌ డీలర్‌ సత్యనారాయణను కిడ్నాప్‌ చేస్తే, ఆయన ప్రాణాలు కాపాడుకునేందుకు ఆలయంలోకి వెళ్లి తలదాచుకుంటే తప్పుడు కేసులు పెట్టారన్నారు. పిడుగురాళ్లలో జ్యోతి అనే మహిళను అర్ధరాత్రి వరకు స్టేషన్‌లో ఉంచారని, మహిళ కానిస్టేబుల్‌ లేకుండా ఆ సమయం వరకు ఇలా కూర్చోబెట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆర్యవైశ్యులను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తొత్తుల్లా పనిచేసేందుకా సంఘాలు పెట్టుకున్నది? అని ఆయన మండిపడ్డారు. తాను కూడా ఒక ఆర్యవైశ్యుడిగా, వైఎస్సార్‌సీపీ నాయకుడిగా గళం విప్పుతానని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఉద్యమం చేస్తామని తెలిపారు. దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

ఇప్పుడేమో పొట్టి శ్రీరాములు మీద ప్రేమ ఉంది, అమరావతిలో 58 అడుగుల విగ్రహం పెడతామని ఆర్యవైశ్యుల వద్ద చందాలు వసూలు చేయడంపై వెలంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి రూ.2 కోట్లు, దాని డీపీఆర్‌కు రూ.11 కోట్లు ఇచ్చినప్పుడు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదా అని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యుల కోసమే పనిచేశారా? తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలని ప్రాణాలు అర్పించిన వ్యక్తి అని అన్నారు. రాజధానిలో పొట్టి శ్రీరాములు విగ్రహం పెడుతున్నాం, డబ్బులు ఇవ్వాలని వ్యాపారులను ఒత్తిడి చేయడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. దీనిని తాము ఖండిస్తున్నామన్నారు. ఆయన వెంట నాయకులు రేపాల శ్రీనివాసరావు, చల్లంచర్ల సాంబశివరావు, అచ్యుత శివప్రసాద్‌, కూకుట శ్రీను, తల్లం సతీష్‌, ఆర్యవైశ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement