
ధరల దరువు.. ఎరువు బరువు
ముప్పాళ్ళ: వ్యవసాయంలో ప్రధానమైన ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రం కావటంతో ఎరువుల వాడకం మరింత పెరిగింది. గతంలో ఎరువుల ధరలను పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండేది. ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ కంపెనీలకు ఇవ్వడంతో ధరలు ఏడాదిలో రెండు, మూడు సార్లు పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న పాపాన పోలేదు. దీంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. రైతన్నలకు సాగు మరింత భారంగా మారుతోంది.
కంటితుడుపు చర్యలతో సరి
మండలంలో ఏడాదికి దాదాపు 4 వేల టన్నుల రసాయన ఎరువులు వినియోగిస్తుంటారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా. ఒక్కో బస్తా (50 కేజీలు)పై కనిష్టంగా రూ.50–గరిష్ఠంగా రూ.300 వరకు పెరిగింది. టన్నుపై కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.4 వేల వరకు ధర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సాగును ప్రోత్సహించేందుకు కంటితుడుపు చర్యలే తప్ప కూటమి ప్రభుత్వంలో రైతుకు ప్రోత్సాహకాలు అందటం లేదు.
పెరుగుతున్న వాడకం
వర్షాలతో ఖరీఫ్ సీజన్ కూడా ముందుగానే మొదలైంది. మోతాదుకు మించి రసాయన ఎరువుల వినియోగంతో వ్యయం విపరీతంగా పెరిగింది. ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపకపోవటంతో సాగు భారంగా మారింది. ఖరీఫ్‌లో సాగు చేసే పత్తి, మిరప, పసుపు, మొక్కజొన్న పంటలకు యూరియాతోపాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. వీటితో పాటుగా 14–35–14, 20–20–0–13, 10–26–26 ఎరువులను వాడుతున్నారు. ఎకరాకు కనీసం 10 నుంచి 16 బస్తాల వరకు వినియోగిస్తున్నారు. ఆ మేర నిల్వ చేసుకుంటారు. దరలు పెరగటంతో రైతులకు శాపంగా మారింది. ఒక్కో రైతుపై రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు భారం పడనుంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో మేలు
2014–19 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో కూడా నాలుగైదు సార్లు రసాయన ఎరువుల ధరలు పెరిగాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019–24 కాలంలో రసాయన ఎరువుల ధరలు ఒక్కసారిగా కూడా పెరిగిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే రైతుల నడ్డి విరిచేలా మూడు దఫాలుగా ధరలు పెంచడం గమనార్హం. పైగా రైతు భరోసా కేంద్రాల నేరుగా రైతులకు గ్రామంలోనే ఎరువులు అందించారు. నేడు వాటి కోసం రైతులు పట్టణాలకు, మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.
ముప్పాళ్ళ సొసైటీ గోదాములో నిల్వ ఉన్న యూరియా బస్తాలు
అమాంతం పెరిగిన ఎరువుల ధరలు మూడు సార్లు పెంచిన కంపెనీలు నోరు మెదపని కూటమి ప్రభుత్వం ఒక్కో రైతుపై రూ.4 వేల అదనపు భారం గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నష్టాలు పెట్టుబడి భారం పెరగడంతో కష్టాలు
పెరిగిన ఎరువుల ధరలు (రూ.లలో)
ఎరువు రకం పాతధర కొత్త ధర
20–20–0–13 (గ్రోమోర్) 1,300 1,350
20–20–0–13 (ఫ్యాక్ట్) 1,300 1,425
20–20–0–13 (పీపీఎల్) 1,300 1,400
10–26–26 1,470 1,800
14–35–14 (గ్రోమోర్) 1,700 1,800
సూపర్‌పాస్ఫేట్ 580 640
పొటాష్ 1,535 1,700
16–20–0–13 1,250 1,300
మూడు నెలలకోసారి పెంపు
నేను ఏటా పది ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న, వరి, అరటి పంట సాగు చేస్తుంటాను. మూడు నెలలకొకసారి ఎరువుల ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో పెట్టుబడి భారీగా పెరిగిపోతోంది. అదే రీతిలో పంటలకు గిట్టుబాటు ధర కూడా పెంచితే సాగు చేసేందుకు రైతు ఆసక్తి చూపుతాడు. గిట్టుబాటు ధర మాత్రం ఏడాది ఒకసారి మొక్కుబడిగా పెంచుతారు.
– లోకసాని నర్సిరెడ్డి, రైతు, ముప్పాళ్ళ
గిట్టుబాటు ధరలూ పెంచాలి
పెరిగిన ఎరువుల ధరలతో ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అదనపు భారం పడుతోంది. ఇప్పటికే పండిన పంటలకు గిట్టుబాటు ధర అందక సాగులో కష్టాలు పెరిగాయి. అయినప్పటికీ ఫర్టిలైజర్ కంపెనీలు మాత్రం ఇష్టానురీతిలో ధర పెంచుకుంటూ పోతున్నాయి. ఎరువులపై సబ్సిడీ అందించి రైతులను ప్రోత్సహించాలి.
–బత్తుల శ్రీనివాసరావు,
రైతు, చాగంటివారిపాలెం

ధరల దరువు.. ఎరువు బరువు

ధరల దరువు.. ఎరువు బరువు