బ్రెయిలీ ఉచిత పాఠ్యపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట: జిల్లాలో ఒకటినుంచి పదోతరగతి వరకు చదివే అంధ విద్యార్థులు ఉచిత బ్రెయిలీ పాఠ్య పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయో వృద్ధుల సంక్షేమశాఖ జిల్లా అధికారి జి.సువార్త మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్‌జీఓ సంస్థల్లో చదివే అంధ విద్యార్థులు ఆయా సంస్థల హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాల్స్ ద్వారా www.apdascac. ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. నిబంధనలను అనుసరించి ఉచితంగా వారికి బ్రెయిలీ పుస్తకాలు అందజేస్తామన్నారు. ఈ సదుపాయాన్ని బాలబాలికలు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాసభను జయప్రదం చేయండి
సంఘం జిల్లా అధ్యక్షుడు చినరామిరెడ్డి
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈనెల 5వ తేదీన విజయవాడలో తలపెట్టిన 3వ రాష్ట్ర కౌన్సిల్ మహాసభను జయప్రదం చేయాలని సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చినరామిరెడ్డి కోరారు. సంఘం యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు సమావేశానికి హాజరు కావాలని కోరారు. సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆహ్వానించామని, ఆయన సానుకూలంగా స్పందించటంతో పాటు సమావేశానికి హాజరయ్యే ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. యూనిట్ సమావేశంలో జిల్లా కార్యదర్శి చుక్క వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి షేక్ బాజీ, కోశాధికారి పీటర్ డామియన్ పాల్గొన్నారు.
బాలికపై లైంగిక వేధింపులు.. కేసు నమోదు
లక్ష్మీపురం: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏటీ అగ్రహారం పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు కలిగాక మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన షేక్ మస్తాన్ అనే వ్యక్తిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. మొబైల్ షాపులో పని చేసుకుంటూ ఆమె జీవనం సాగిస్తున్నారు. మస్తాన్‌కు రెండో వివాహం చేయాలని ఆయన కుటుంబసభ్యులు సిద్ధం అయ్యారు. దీంతో ఆమె నిలదీయడంతో ఒంటరిగా వదిలేశాడు. ఇటీవల ఆమె కుమార్తె (8) నిద్రలో ఉలిక్కి పడటం, ఏడవడం వంటివి చేస్తుండటంతో ఏమైందని తల్లి ఆరా తీసింది. మస్తాన్ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. దీంతో నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


