మహిళలపైనా దౌర్జన్యాలు
రెడ్ బుక్ పేరుతో
● వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో రెడ్ బుక్ పేరుతో కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ... పోలీసు వ్యవస్థ గాడి తప్పిందని మండిపడ్డారు. చివరికి దళిత, బీసీ మహిళలను సైతం అత్యంత దారుణంగా అవమానపరిచేలా కొంతమంది పోలీస్ అధికారులు వ్యవహరించటం సిగ్గు చేటన్నారు. శనివారం చిలకలూరిపేటలో పార్టీ నాయకుడిని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి, బీసీ మహిళ అయిన విడదల రజిని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు అనుచితంగా ప్రవర్తించి, ఆమైపె దౌర్జన్యం చేయడం చాలా బాధాకరమన్నారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఏక వచనంతో ‘నీకు చెప్పేదేంటి, నీతో మాట్లాడేదేంటి?’ వంటి పదాలతో ఆమెను అవమానించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఓ పోలీసు అధికారినన్న స్పృహ కూడా లేకుండా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరించడం దారుణమన్నారు.
చట్టపరమైన చర్యలు తప్పవు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, బీసీ వర్గాలకు చెందిన మహిళలను రాత్రీపగలు అనే తేడా లేకుండా అరెస్టులు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా కంతేరులో వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ కల్పన అనే దళిత మహిళను తెల్లవారుజామున 3 గంటల సమయంలో అక్రమంగా అరెస్టు చేశారని గుర్తుచేశారు. మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అనుచితంగా ప్రవర్తించటం దారుణమన్నారు. బీసీ, దళిత మహిళల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ రోజు అధికార పార్టీ అండ చూసుకొని అక్రమ కేసులు పెట్టటం, మహిళల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసుల విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. ప్రతి అక్రమ కేసుపై భవిష్యత్తులో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


