
పేదల బియ్యం పక్కదారి
చీరాల: పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. అర్హులకు అందాల్సిన బియ్యాన్ని అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అధికారులు అక్కడక్కడా పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా ఈ దందాను నిలువరించలేకపోతున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. జిల్లాతోపాటు పక్కనే ఉన్న పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి కూడా అక్రమ వ్యాపారం చేసే వారు క్యూ కడుతున్నారు. దందా నిర్వహించే వారికి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తెరవెనుక అభయ హస్తం అందిస్తున్నట్లు సమాచారం.
నెలలో పది రోజులే వ్యాపారం...
ప్రభుత్వం పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రతి నెల ఒకటోతేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు. కొంత మంది డీలర్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎక్కువ మంది డబ్బులకు విక్రయిస్తున్నారు. కార్డుదారుల నుంచి కేజీ రూ.10 చొప్పున, డీలర్ల నుంచి రూ.15కు తీసుకుంటున్నారు. తర్వాత మిల్లులకు తరలించి పాలిష్ పట్టాక దూర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అనుచరులు కూడా అక్రమార్కులతో కుమ్మక్కు అవుతున్నారు.
విలేకర్లు ‘విజిలెన్స్’ అవతారం..
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పోలీసులు, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేసి, సీజ్ చేస్తుంటారు. తాజాగా విలేకర్లు ఈ విజిలెన్స్ అధికారుల అవతారమెత్తారు. ఇటీవల పర్చూరు నుంచి చీరాలకు లారీలో రేషన్ బియ్యాన్ని రాత్రి వేళ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఐదుగురు విలేకర్లు కారులో వెంబడించారు. లారీని ఆపి డబ్బులు డిమాండ్ చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు చెబుతామని దండుకున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అక్రమార్కులు కూడా ఎందుకొచ్చిన గొడవ అన్నట్లు కొంత ముట్టజెప్పారు. ఈ వ్యవహారం పత్రికలకు ఎక్కింది. గతంలో స్వర్ణలోని ఓ ప్రజాప్రతినిధికి చెందిన రైస్ మిల్లులో రేషన్ బియ్యం ఉన్నట్లు మీడియాలో రాగా డబ్బులు డిమాండ్ చేశారు. ఆయన కారంచేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరుకు చెందిన విలేకరులపై కేసు నమోదు చేశారు. కొందరు విలేకర్లు హైవేలపై కూడా ట్రాన్స్‌పోర్టు లారీలను ఆపి డబ్బులు దండుకుంటున్నారు.
జిల్లాలో యథేచ్ఛగా
సాగుతున్న దందా
పలుచోట్ల అడ్డగోలుగా
ఇసుక తరలింపు
అవే అక్రమార్కులకు సిరులు...
రేషన్ బియ్యం తరలింపుతోపాటు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కూడా జోరుగా సాగుతోంది. ఈ రెండూ అక్రమార్కులకు రెండు కళ్లు. సిరులు కురిపించే అక్రమ వ్యాపారాలు చేయడానికి పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. అధికార పార్టీలో ప్రజాప్రతినిధులకు చెందిన రెండు వర్గాలు ఇసుక రవాణా చేసేందుకు పోటీ పడ్డాయి. గతంలో ఇసుక తవ్వడానికి వినియోగించిన జేసీబీని దహనం చేయడం వంటి సంఘటనలు జరిగాయి. జిల్లాలో చీరాల, రేపల్లె, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల పరిధిలోని ఇసుకను లారీల ద్వారా దూర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇసుకాసురుల ధన దాహానికి తీర ప్రాంతాలు కుంచించుకుపోతున్నాయి. వందల అడుగుల లోతున జేసీబీలతో ఇసుకను తవ్వుతూ పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తున్నారు. అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి కేసులతో సరిపెడుతున్నారు.