పునరావాసం కల్పించి ఇళ్లను కూల్చండి
గుంటూరు రూరల్: ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేజ్ 3 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 41వ డివిజన్ స్వర్ణభారతినగర్‌లో సుమారు 200 ఇళ్లను అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా తొలగిస్తున్నారు. దీంతో ఇళ్లు కోల్పోతున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఇళ్లు కట్టుకుని ఉంటున్నామని, కూలీనాలీ చేసుకుని బతుకుతున్నామని పేర్కొంటున్నారు. అధికారులు ఉన్నపళంగా ఇళ్లను కూలిస్తే ఏం చేయాలని కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు పూర్తి పునరావసం కల్పించి ఇళ్లను కూల్చాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఇళ్ళను పొక్లెయిన్లతో కూల్చి వేస్తున్న క్రమంలో అడ్డుకున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం పునరావాసం కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్, కమిషనర్, నగర మేయర్‌కు వినతిపత్రాలు అందించారు. పిల్లాపాపలతో రోడ్డున పడతామని కాస్త కనికరం చూపి న్యాయం చేయాలని వేడుకున్నారు.
అధికారులు తొలగిస్తున్న ఇళ్లు
పునరావాసం కల్పించిన తర్వాతే ఇళ్లను కూల్చాలి
సుమారు 200 కుటుంబాలు ఇళ్ళను కోల్పోతున్నారు. వారికి పూర్తి పునరావాసం కల్పించాలి. లేదా ప్రస్తుతం ఎక్కడో ఒక చోట తలదాచుకునేందుకు వసతి కల్పించాలి. ప్రభుత్వమే అద్దె చెల్లించాలి. వారిని ఆదుకోవాలి. ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి. న్యాయం చేయాలి. లేకుంటే పోరాటం తప్పదు.
–పిల్లి మేరి, స్థానికురాలు,
ఆర్ అండ్ బీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్
కూలీనాలీ చేసుకుని
బతికేవాళ్లం
40 ఏళ్ళుగా ఇక్కడ గత ప్రభుత్వాలు ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకుని కూలీనాలీ చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి ఇళ్ళను కూల్చేస్తున్నారు. పునరావాసం కల్పించి ఇళ్లు కూల్చుకోవాలని చెబుతున్నాం. అయినా పట్టించుకోవడం లేదు. ఇల్లు కూల్చేశారు. ఇప్పుడు పిల్లలతో కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్లాలి? పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు.
– జిల్లా సత్యవతి, స్థానికురాలు,
బాధితురాలు
40 ఏళ్ల నుంచి నివసిస్తున్నాం ఇళ్లను తొలగించడం అన్యాయం ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3లో ఇళ్లు కోల్పోతున్న 200 కుటుంబాల ఆవేదన
మాకు దిక్కెవరు?
మా అమ్మనాన్నలు బతికుండగా 30 ఏళ్ళ క్రితం కూలీనాలీ చేసి ఇల్లు కట్టారు. అందులో అమ్మనాన్న, మా చెల్లి నేను కూలీ పనులు చేసుకుని జీవిస్తుండేవారం. రెండేళ్ళ క్రితం మా అమ్మనాన్నలు అనారోగ్యంతో మరణించారు. ప్రస్తుతం మా చెల్లితో నేను ఇక్కడే ఇంట్లో తలదాచుకుంటూ ఇద్దరం కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం. ఇప్పుడు అధికారులు ఇల్లు కూల్చేశారు. మాకు దిక్కెవరు లేరు. అధికారులు పట్టించుకోవటంలేదు. మమ్మల్ని ఆదుకోండి.
– పాతకోటి కృష్ణబాబు, బాధితుడు
పునరావాసం కల్పించి ఇళ్లను కూల్చండి
పునరావాసం కల్పించి ఇళ్లను కూల్చండి
పునరావాసం కల్పించి ఇళ్లను కూల్చండి


