నరసరావుపేట ఈస్ట్: డిగ్రీ కళాశాలల సమస్యలను పరిష్కరించుకోవడంలో సమష్టిగా కృషి చేయాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు తీర్మానించాయి. రావిపాడురోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో మంగళవారం వర్సీటీ అనుబంధ కళాశాలల యాజమాన్య సంఘం సమావేశం నిర్వహించారు. కళాశాలలకు ఎదురవుతున్న సమస్యలను ఐకమత్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఈసందర్భంగా యాజమాన్యాల ప్రతినిధులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కళాశాలల ఖాతాల్లో ఫీజురీయింబర్స్‌మెంట్ నగదు వేయటంపై కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలల అఫిలియేషన్ గడువును 5 సంవత్సరాలకు ఒకేసారి ఇవ్వాలని, జీఓ 36ను రద్దు చేయాలని కోరారు. అలాగే 30 శాతం మేనేజ్‌మెంట్ సీట్ల కోటాను రద్దు చేసి అన్ని సీట్లు కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలన్నారు. ఆయా సమస్యలను ప్రభుత్వం, వర్సీటీ అధికారుల దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరించేలా అసోసియేషన్ కృషి చేయాలని తీర్మానించారు.
నూతన కార్యవర్గం..
వర్సీటీ అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం అధ్యక్షుడిగా రాయల శ్రీనివాసరావు (వాగ్దేవి డిగ్రీ కళాశాల, నరసరావుపేట), ప్రధాన కార్యదర్శిగా ప్రమదా రాజశేఖర్ (మంగళగిరి), ఫైనాన్స్ సెక్రటరీగా మైనీడి శ్రీనివాసరావు (విక్టరీ డిగ్రీ కళాశాల, నరసరావుపేట), ఉపాధ్యక్షులుగా వై.వెంకట్రామయ్య (మాచర్ల), పి.సీతారామ్‌బాబు (వినుకొండ), జాయింట్ సెక్రటరీగా వీరవల్లి శ్రీనివాసరావు (సత్తెనపల్లి), కార్యవర్గ సభ్యులుగా గంట కిషోర్‌కుమార్ (గురజాల), చేబ్రోలు మహేష్ (చిలకలూరిపేట), బాడిశ మస్తాన్ (పిడుగురాళ్ల) ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం సంఘం ప్రతినిధులు రాంబాబు, పెద్దిరాజు, రాష్ట్ర జూనియర్ కళాశాలల సంఘం అధ్యక్షుడు వీవీ ప్రసాద్ వ్యవహరించారు. సమావేశంలో వర్సిటీ పరిధిలోని కళాశాలల యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు.
వర్సిటీ అనుబంధ కళాశాలల
యాజమాన్య సంఘం