జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రవి
నరసరావుపేట: ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలోని ప్రజలందరూ ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకుంటూ వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బి.రవి కోరారు. ఈ మేరకు శనివారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీడియాకు వివరించారు. తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం కలిగియుండటం, మత్తు నిద్ర, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక, పూర్తి అపస్మారక స్థితి కలిగి ఉంటే వడదెబ్బ తగిలినట్లుగా భావించాలని చెప్పారు. అటువంటి వారిని నీడగా ఉన్న చల్లటి ప్రాంతానికి వెంటనే చేర్చాలని, తడి గుడ్డతో శరీరం రుద్దుతూ ఉండాలని, ఐస్ నీటిలో బట్టను ముంచి శరీరం తుడవాలని అన్నారు. శరీర ఉష్ణోగ్రత 101– డిగ్రీస్ కంటే లోపునకు వచ్చేవరకు ఐస్ వాటర్ బట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలని, వడదెబ్బకు గురైనవారు సాధారణ స్థితికి రాకుంటే వారిని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు.
రక్షణ ఇలా...
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తెలుపు రంగు గల పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలని, నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకోవాలని, వీలైనంతవరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించాలని సూచించారు. దాహం వేయకపోయినా తరచుగా నీటిని తాగుతూ ఉండాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓఆర్‌ఎస్ కలిసిన నీటిని తాగవచ్చునని చెప్పారు. మంచినీరు ఎక్కువ సార్లు తాగాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఒక గ్లాస్ మంచి నీరు, ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసం, కొబ్బరినీరు లేదా చల్లని నీరు తాగాలని, తీవ్రమైన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తలతిరగటం లాంటి ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే దగ్గరలో ఉన్న వైద్యుణ్ణి సంప్రదించి ప్రాతమిక చికిత్స పొందాలని అన్నారు. సూర్యకిరణాలు, వేడిగాలికి శరీరంపై పడకుండా ఉంచుకోవాలని, సూర్యకాంతిలో గొడుగు లేకుండా తిరుగరాదని, నలుపు రంగు దుస్తులు మందంగా ఉండే దుస్తులు ధరించకుండా ఉంటే మంచిదని అన్నారు. ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకొన కూడదని అన్నారు. శీతలపానీయం, మంచుముక్క వంటివి తీసుకొంటే గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు.