వరాల వరికపూడిశెల | Sakshi
Sakshi News home page

వరాల వరికపూడిశెల

Published Tue, Nov 14 2023 1:04 AM

- - Sakshi

● ఎట్టకేలకు సాకారం ● సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా రేపు పనులు ప్రారంభం ● 70 ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టు ● అన్ని అనుమతులూ సాధించిన రాష్ట్ర ప్రభుత్వం ● నిర్మాణం పూర్తయితే మూడు నియోజకవర్గాలు సస్యశ్యామలం

సాక్షి, నరసరావుపేట: పల్నాటి ప్రజల చిరకాల కల నెరవేరబోతోంది. వెనకబడిన ప్రాంతమైన పల్నాడు చెంతనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా.. ఈ ప్రాంత ప్రజలు సాగు, తాగునీటికి కటకటలాడుతున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మించి ఆరు దశాబ్దాలు దాటినా పరిస్థితిలో మార్పు లేదు. సాగర్‌ నిర్మాణ సమయంలోనే ఈ ప్రాంత నీటి సమస్యను గుర్తించిన జలవనరుల శాఖ నిపుణులు.. పల్నాడు ప్రాంతానికి తాగు, సాగునీరు అందించేందుకు వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మించాలని అప్పటి ప్రభుత్వానికి సూచించారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వరికపూడిశెలకు చేరుతాయి. ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే వెల్దుర్తి, బొల్లాపల్లి, మాచర్ల, దుర్గి, కారంపూడి, యరగ్రొండపాలెం మండలాల్లో 1.25 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, లక్ష మందికి తాగునీరూ అందుబాటులోకి వస్తుందని ప్రతిపాదించారు. ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులూ సాధించి బుధవారం పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేయనున్నారు.

కేంద్రాన్ని ఒప్పించి..

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువన 40 కిలోమీటర్ల దూరంలో నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రధాన ప్రాంతంలో ఈ వరికపూడిశెల వాగు ఉంది. ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్నా కేంద్ర అటవీ, పర్యావరణ, వన్యప్రాణ సంరక్షణ శాఖల నుంచి అనుమతులు తప్పనిసరి. ఈ విషయం తెలిసినా గత పాలకులు అనుమతుల జోలికి వెళ్లకుండా శంకుస్థాపనతోనే ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక అధికారులు, ప్రజాప్రతినిధులను ఢిల్లీకి పంపి కేంద్ర మంత్రులతో పలు దఫాలు చర్చలు జరిపేలా చూశారు. టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు నుంచి నాలుగు కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మాణం కోసం 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేంద్రం కేటాయించేలా చేశారు. ఇందుకు ప్రతిఫలంగా దుర్గి మండలం ఓబులేశునిపాలెం గ్రామంలో 21 హెక్టార్ల ప్రభుత్వ భూమిని అటవీశాఖకు బదిలీ చేశారు. దీంతోపాటుగా ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని కేంద్రానికి తెలియజెప్పి అన్ని అనుమతులూ తీసుకొచ్చారు. వరికపూడిశెలవాగు కుడి గట్టుపై పంప్‌హౌస్‌ నిర్మాణానికి.. టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో నాలుగు కిలోమీటర్ల పొడవున పైపులైన్‌ నిర్మాణానికి వన్యప్రాణ సంరక్షణ శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ పొందారు. దీనికోసం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విశేష కృషి చేశారు.

డీపీఆర్‌, టెండర్ల ప్రక్రియ పూర్తి

వరికపూడిశెల పథకాన్ని రెండుదశల్లో నిర్మించనున్నారు. మొదటి దశ పూర్తయితే వెల్దుర్తి మండలంలోని గంగలకుంట గ్రామం సమీపం నుంచి లిఫ్ట్‌ ద్వారా 1.547 టీఎంసీల నీరు ఎత్తి పోసి, పంట పొలాలు, తాగునీటికి సరఫరా చేయనున్నారు. రోజుకు 281 క్యూసెక్కుల పరిమాణంలో నీటిని లిఫ్ట్‌ చేయనున్నారు. రూ.340.26 కోట్ల విలువైన ఈ పనులకు సంబంధించి డీపీఆర్‌, టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మెగా ఇంజినీరింగ్‌ సంస్థ పనులు చేపట్టనుంది. ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని వెల్దుర్తి మండలం వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయనున్నారు. పైపులైన్ల ద్వారా నీటిని తరలించడం వల్ల సరఫరా నష్టాలు ఉండవని.. ఆయకట్టుకు సమర్థంగా నీటిని అందింవచ్చునని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పైపులైన్ల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించే తొలి ఎత్తిపోతల వరికపూడిశెల కావడం గమనార్హం. ఈ మొదటి దశ పనులతో సుమారు 20 వేల మందికి తాగునీరు ఇవ్వనున్నారు. రెండో దశలో సుమారు రూ.3,400 కోట్లతో పనులు చేపట్టేందుకు ఇప్పటికే డీపీఆర్‌ను అధికారులు రూపొందించారు. ఇందులో లిఫ్ట్‌ ద్వారా రోజుకు 858 క్యూసెక్కుల పరిమాణంలో 6.32 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. రెండో దశ ద్వారా మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి మండాలు, వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి, ప్రకాశం జిల్లా యర్రగొండపాలం నియోజకవర్గంలోని పుల్లలచెరువు మండలాల పరిధిలో 1,00,463 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వనున్నారు. సుమారు 80 వేల మందికి తాగునీరు ఇవ్వనున్నారు. వరికపూడిశెల రెండు దశల నిర్మాణం పూర్తయితే మొత్తంగా సుమారు 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్ష మందికి తాగునీరు అందనుంది.

ఇదీ ప్రాజెక్టు స్వరూపం

ప్రాజెక్టు తొలిదశ పనుల అంచనా వ్యయం : 3,740 కోట్ల రూపాయలు

రెండో దశ పనుల అంచనా వ్యయం : 3,400 కోట్ల రూపాయలు

సాగునీరు అందే విస్తీర్ణం : 1,25,000 ఎకరాలు

తాగునీరు పొందే జనాభా : 1,00,000

వెల్దుర్తి మండలంలోని గంగలకుంట సమీపంలో వరికపూడిశెల నిర్మించే ప్రదేశం
1/1

వెల్దుర్తి మండలంలోని గంగలకుంట సమీపంలో వరికపూడిశెల నిర్మించే ప్రదేశం

Advertisement
 
Advertisement