● రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
● ఆగివున్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
● బంధువులు ఇంటికి వెళ్తుండగా ఘటన
టెక్కలి రూరల్: ఏడు అడుగులతో మొదలైన వారి జీవిత ప్రయాణం.. ఒక ప్రమాదంతో ముగిసిపోయింది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచిన ఆ దంపతులు.. మృత్యువులోనూ ఒకరినొకరు వీడలేదు. నిన్నటివరకు ఆప్యాయంగా పలకరించిన ఇద్దరూ నేడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళంలోని గుజరాతీపేటకు చెందిన తిప్పాన రామారావు(54), అతని భార్య పార్వతి(50)తో కలిసి టెక్కలి మండలం విక్రాంపురం గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి తన ద్విచక్ర వాహనంపై శనివారం బయల్దేరారు. వారు కోటబొమ్మాళి మండలం శ్రీపురం గ్రామం సమీపంలోకి వచ్చేసరికి రహదారి పక్కన ఆగివున్న లారీని గుర్తించకుండా బలంగా ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇరువురూ రోడ్డుపై పడిపోయి తీవ్రగాయాలకు గురయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు 108, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా ఇరువురూ మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాళి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించారు. అయితే వీరు ఢీకొన్న లారీ మాత్రం ఘటన జరిగిన అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం మృతదేహాలను శవపంచనామ నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు ముగ్గురు పిల్లలు ఉండగా.. వారికి వివాహాలు అయిపోయినట్లు తెలుస్తోంది.
కోటబొమ్మాళి జాతీయ రహదారిపై అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జరిగిన ఘటనల్లో చాలామంది మృత్యువాత పడుతున్నారు. మండలంలో ముఖ్యంగా హరిశ్చంద్రాపురం, ఎత్తురాళ్లపాడు, పొడుగుపాడు, జర్జంగి, శ్రీపురం తదితర గ్రామాల సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డుపక్కగా లారీలు ఆపుతుండడంతో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ వాటిని కట్టడి చేసేందుకు అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావడం లేదంటూ పలువురు వాపోతున్నారు.


