యంత్రాంగం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

యంత్రాంగం సిద్ధం

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

తుఫాన్‌ ఎదుర్కొనేందుకు

భువనేశ్వర్‌: బంగాళా ఖాతంలో ఏర్పడనున్న తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ మాఝీ తెలిపారు. ఈసారి కూడా సున్నా ప్రాణనష్టం లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. లోక్‌సేవా భవన్‌లో శనివారం తుఫాన్‌ సన్నద్ధతపై సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో దానా, మోంథా తుఫాన్‌లతోపాటు పలు వరద పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న అనుభవం ప్రభుత్వానికి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ నెల 28న ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ – దక్షిణ ఒడిశా మధ్య తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉందని, అయితే ఆంధ్రప్రదేశ్‌ తీరంలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 80 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా దక్షిణ ఒడిశా జిల్లాలపై ప్రభావం అధికంగా ఉండొచ్చని పేర్కొన్నారు. గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్‌, మల్కన్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ఈ నెల 28, 29 తేదీల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లో పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులపై కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

సహాయక బృందాలు అప్రమత్తం

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తుఫాన్‌, వరద ఆశ్రయ కేంద్రాలను సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రోగులు, గర్భిణులను ముందస్తుగా ఆరోగ్య కేంద్రాలకు తరలించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఒడిశా విపత్తు శీఘ్ర స్పందన దళం (ఓడీఆర్‌ఏఎఫ్‌)కు చెందిన 60 బృందాలు, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కు చెందిన 17 బృందాలను మోహరించామని, అగ్నిమాపక శాఖకు చెందిన 225 బృందాలను అప్రమత్తం చేశామని వివరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటు విరుగుడు మందులు, ఇతర ఔషధాలు, వైద్య సామగ్రి అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పారు. తుఫాన్‌ కారణంగా రహదారులపై చెట్లు కూలితే వెంటనే తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు, ఇతర అత్యవసర మరమ్మతులు చేపట్టేందుకు ఇంజినీరింగ్‌ శాఖలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

పంటల రక్షణకు ముందస్తు చర్యలు

పంట కోతల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో రైతులను ముందుగానే అప్రమత్తం చేయాలని, పంటలను కోసి సురక్షితంగా నిల్వ చేసుకునేలా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ తుఫాన్‌ ముప్పును ఎదుర్కోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ పూజారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అభివృద్ధి కమిషనర్‌, అగ్నిమాపక శాఖ డీజీ, రెవెన్యూ అదనపు ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ప్రత్యేక సహాయ కమిషనర్‌ (ఎస్‌ఆర్‌సీ) తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రాణనష్టం నివారించడమే

లక్ష్యం : సీఎం

అక్టోబర్‌ 28న తీరం దాటే అవకాశం

జిల్లాల్లో 28, 29 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement