భువనేశ్వర్: ఒడిశాలో పర్యాటకాభివృద్ధికి సమగ్ర విధానం అవసరమని గవర్నర్ బ్రజ్‌మోహన్ రామ్ పిలుపునిచ్చారు. ఈ దిశలో రాష్ట్రంలోని విభిన్న పర్యాటక ఆకర్షణలను ప్రోత్సహించి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మారుమూల ప్రాంతాలతో సహా స్థానిక ప్రజలకు పర్యాటక ప్రయోజనాలు చేరేలా చూడటం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. భువనేశ్వర్‌లో జరిగిన 7వ ఒడిశా పర్యాటక సదస్సు ముగింపు వేడుకలో గవర్నర్ మాట్లాడుతూ, ప్రతి జిల్లాకు దాని స్వంత పర్యాటక సామర్థ్యం, సహజ సంపద, చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక సంప్రదాయాలకు నెలవుగా వెలుగొందుతుంది. వాటిని గుర్తించి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి చర్చలు, ఒడిశా పర్యాటక సామర్థ్యాన్ని విధానపరమైన కార్యక్రమాలుగా, నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలుగా మార్చడంలో సహాయపడతాయని నిర్వాహక సంస్థ ఒడిశా హోటల్ మరియు రెస్టారెంట్ అసోసియేషన్‌కు అభినందించారు. పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు కొత్త గమ్యస్థానాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మరిన్ని అవకాశాలను అందిస్తాయని ఆయన అన్నారు. ఒడిశాను ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చడానికి మెరుగైన కనెక్టివిటీ, నాణ్యమైన వసతి, ఆధునిక సౌకర్యాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సమర్థవంతమైన డిజిటల్ ప్రచారం అవసరమన్నారు.


