● తుఫాను సన్నద్ధత చర్యలు ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

● తుఫాను సన్నద్ధత చర్యలు ముమ్మరం

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

భువనేశ్వర్‌: బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫానును ఎదుర్కొనేందుకు సన్నద్ధత చర్యలను ముమ్మరం చేసింది. రాజీవ్‌ భవన్‌లోని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం సమావేశ మందిరంలో రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ పూజారి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర సంసిద్ధతను సమీక్షించిన మంత్రి శూన్య ప్రాణనష్టమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సన్నద్ధత చర్యలను సమీక్షించిన మంత్రి అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఆకస్మిక కార్యాచరణ ప్రణాళికలను తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను గుర్తించి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఓఎస్‌డీఎంఏ) జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. అవసరమైన సదుపాయాలు, అత్యవసర సహాయక బృందాలతో తుఫాను ఆశ్రయాలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేసింది.

గర్భిణులు, శిశువుల భద్రతకు ప్రాధాన్యం

గర్భిణులు, నవజాత శిశువుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రసవ సమయం సమీపించిన గర్భిణులను గుర్తించి, ముందుగానే సురక్షిత ఆశ్రయాలకు లేదా సమీపంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. అత్యవసర మందులు, మొబైల్‌ వైద్య బృందాలు, వైద్య సహాయక కేంద్రాలు, ప్రత్యామ్నాయ విద్యుత్‌ సరఫరా వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు. అత్యవసర ప్రసవాలకు అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. తుఫాను ఆశ్రయాల్లో గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లలకు సురక్షిత తాగునీరు, పొడి ఆహారం, అవసరమైన వైద్య సలహాలు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. పశువుల సంరక్షణకు అవసరమైన మేతకు తగినంతగా దాణా నిల్వ చేయడంతో పాటు, పశువైద్య నిపుణులను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.

అధికారుల సెలవులు రద్దు

తుఫాను ముప్పు నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అధికారుల సెలవులను రద్దు చేయడంతో పాటు, ఇప్పటికే సెలవులో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించినట్లు మంత్రి సురేష్‌ పూజారి తెలిపారు.

సీఎం ప్రజాభియోగ శిబిరం రద్దు

తుఫాను పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్‌ 26, సోమవారం జరగాల్సిన ముఖ్యమంత్రి ప్రజాభియోగ శిబిరాన్ని రద్దు చేశారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకున్నవారు మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భువనేశ్వర్‌లో తదుపరి ప్రజాభియోగ విచారణ తేదీని తర్వాత ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement