కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాపై పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉల్క ఆవేదన వ్యక్తం చేశారు. 1936లో ఒడిశా రాష్ట్ర ఆవిర్భావం నుంచే జయపూర్ రాజ సంస్థానం రికార్డుల ప్రకారం కొఠియా ఒడిశాలో ఉండేదన్నారు. ఆ ఏడాది ఏప్రీల్ 1వ తేదీ నుంచి ఒడిశాలో ఉన్నట్లు భారత ప్రభుత్వం రాజ్యాంగ రికార్డులు ఉందన్నారు. 1955 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటైన నాటి నుంచి కొఠియా తమదని వాదిస్తుందన్నారు. 1960 లో ఒడిశా సుప్రీం కోర్టుని ఆశ్రయించిందన్నారు. 2006 లో హద్దుల నిర్ణయం జరిగిందన్నారు. కానీ ఈ వివాదం పరిష్కరించాలన్నారు. కొఠియాని ఒడిశాదేనని గుర్తించాలని ఎంపీ ఉల్క పేర్కొన్నారు.
కొఠియాలో ఆంధ్ర అధికారుల పర్యటన
కొఠియాలో రోజురోజుకీ పరిస్థితి సున్నితంగా మారుతుండడంతో ఆంధ్ర అధికారులు పర్యటించారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలానికి చెందిన వివిధ విభాగాల అధికారులు తరలి వచ్చారు. వీరు వివాదాస్పద గ్రామాల్లో ప్రజలతో సంభాషించారు. ఓటర్లు ధైర్యంగా వచ్చి పోలింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పలు చోట్ల ప్రజలు తాము ఆంధ్ర పోలింగ్‌లో పాల్గొంటామని చెప్పడం గమనార్హం. సాలూరు ఎంపీడిఓ జి.పార్వతి, తహసీల్దార్ ఎం.సురేష్, సాలూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.రామకృష్ణ, సాలూరు ఎస్‌హెచ్‌ఓ రవీంద్ర రాజు తదితరులు పర్యటించారు.
కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడి పర్యటన..
కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు రాంచంద్ర ఖడం పర్యటించారు. వివాదాస్పద ప్రాంతం రాం చంద్ర ఖడం సొంత నియోజకవర్గం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కొఠియా ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని గిరిజనులకు వివరించారు. కొఠియా ఒడిశాలో అంతర్భాగమని వివరించారు. కొరాపుట్ సబ్ కలెక్టర్ ఫబీ రషిద్ స్వయంగా కొఠియా గ్రామాలలో పర్యటించారు. ఒడిశా ప్రభుత్వం అందిస్తున్న శుభద్ర,ఇతర సంక్షేమ పథకాలు వివరించారు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొన వద్దని విజ్ఞప్తి చేశారు.
రంగంలోకి శబరి శ్రీక్షేత్ర కమిటీ
కొరాపుట్ శబరిశ్రీక్షేత్ర మందిర కమిటీ శనివారం కొఠియా లో పర్యటించింది. కమిటీ చైర్మన్ గా ఉన్న జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి కొఠియాలో గిరిజనులతో మమేకమయ్యారు. శబరి క్షే త్రం ద్వారా కొఠియా లో జగన్నాథ మందిరం నిర్మించడం, ఏటారథయాత్ర నిర్వహించడం గుర్తు చేశారు.


