● 50 ప్లాటూన్ల పోలీసులు మోహరింపు
భువనేశ్వర్: బారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఖుర్దా జిల్లా జట్నీ సమీపంలోని ఇన్ఫో వ్యాలీ – 2 ప్రాంతంలో నిర్మించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్, శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ప్రధాన మంత్రి భువనేశ్వర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖుర్దా హెలిప్యాడ్‌కు వెళ్లి, రోడ్డు మార్గంలో కార్యక్రమ వేదికకు చేరుకుంటారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడ సుమారు గంటపాటు గడిపి, తిరిగి భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకుని అదే రోజు సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతారు.
నాలుగు అంచెల భద్రత
ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా భువనేశ్వర్ నుంచి జట్నీ వరకు మొత్తం ప్రాంతాన్ని కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంచుతారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. నగరం అంతటా 50 ప్లాటూన్ల పోలీసు బలగాలతో పాటు 300 మందికి పైగా అధికారులను మోహరించనున్నారు. 223 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, సహాయ సబ్ ఇన్‌స్పెక్టర్లను భద్రతా విధుల్లో నియమిస్తారు. 71 మంది ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జిలు, 37 మంది అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్లు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. భద్రతా వ్యవస్థ సమగ్ర పర్యవేక్షణకు ఎస్పీ, డీసీపీ, కమాండెంట్ హోదాలకు చెందిన 10 మంది అధికారులకు బాధ్యతలు కేటాయించారు. బ్లూ బుక్ మార్గదర్శకాల ప్రకారం, కమిషనరేట్ పోలీసులు శనివారం 28 వాహనాలతో కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) ప్రధాన మంత్రి భద్రత ప్రాథమిక బాధ్యతను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది. అభేద్యమైన భద్రతా వలయంతో ప్రధాన మంత్రికి నాలుగు అంచెల భద్రత కల్పిస్తారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిశా పర్యటన దృష్ట్యా ఆదివారం రాజధాని నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు కటక్–భువనేశ్వర్ జంట నగరాల పోలీస్ కమిషనర్ డాక్టర్ సురేష్ దేవ్ దత్తా సింగ్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం 5.40 నుంచి 6.40 వరకు సాధారణ వాహనాల రాకపోకలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి.


