పారాదీప్ పోర్టులో ఆశ్రయం పొందిన
ఆంధ్ర చేపల పడవలు
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం బలపడి ఒడిశా, ఆంధ్ర తీరం వైపు కదలడంతో ఒడిశా తీరం వెంబడి సముద్ర పరిస్థితులు అత్యంత అలజడిగా మారాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 28 ఫిషింగ్ ట్రాలర్లు పారాదీప్ పోర్టులో ఆశ్రయం పొందాయి. వాటిలో 248 మంది మత్స్యకారులు ఉన్నారు. తీవ్ర అల్ప పీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిన పరిస్థితుల్లో చేపల వేట కోసం వెళ్లిన మత్స్యకారులు సముద్రం నడిబొడ్డున చిక్కుకున్నారు. బలమైన గాలులు, అలల కారణంగా తమ సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లలేక వారు పారాదీప్ వైపు పడవలో ప్రయాణించి అక్కడ ఆశ్రయం పొందినట్లు అధికార వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా తీవ్ర అల్ప పీడనం ఏర్పడటంతో పారాదీప్ ఓడ రేవులో 3వ నంబరు స్థానిక హెచ్చరిక సంకేతం ఎగుర వేశారు. తీవ్ర అల్పపీడనం చివరిగా గోపాల్‌పూర్‌కు దక్షిణంగా సుమారు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ రాత్రి కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సముద్రంపై గంటకు 55–65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ముందస్తు జాగ్రత్త చర్యగా, ఓడరేవు అధికారులు నౌకాశ్రయంలోకి ఓడల ప్రవేశాన్ని పరిమితం చేశారు. ఓడరేవు కార్యకలాపాలన్నింటినీ నియంత్రణలోకి తీసుకున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.


