జయపురం: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చి పెట్టిన ఎంఎండీఆర్ 2026 గనుల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 21 వ తేదీన రాయగడ కలెక్టర్‌ను ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. శుక్రవారం జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి నివాస భవనంలో కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆందోళన సన్నాహక సమావేశంలో ఏక గ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రూపక్ కుమార్ తురుక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొరాపుట్ పార్లమెంట్ సభ్యులు సప్తగిరి శంకర ఉల్క, జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీ పతి, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంతతో పాటు అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్‌లో చర్చకు పెట్టకుండానే బిల్లు పాస్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. ఈ చట్టం వల్ల ఒడిశా, ముఖ్యంగా దక్షిణ ఒడిశాలో ఖనిజ సంపద కార్పొరేట్ సంస్థల హస్తగతం అవుతుందని ఆరోపించారు. డీఎంఎఫ్, సీఎస్సార్ నిధుల ద్వారా వచ్చే నిధులు ఆగిపోయి స్థానిక ప్రాంతాల అభివృద్ధి నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జయపురం మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, మల్కన్‌గిరి మాజీ ఎమ్మెల్యే కృష్ణ చంధ్ర సాగరియ, బొరిగుమ్మ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ గంతాయిత్, జయపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, పీసీసీ కార్యదర్శి దుర్గా ప్రసాద్ శర్మ, కొరాపుట్ ఎంపీ ప్రతినిధి మనోజ్ ఆచార్య, జయపురం ఎంపీ ప్రతినిధి హసన్ మధానీ, కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్య పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.


