దసరా ఉత్సవాలకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

దసరా ఉత్సవాలకు సన్నాహాలు

Sep 6 2026 2:25 AM | Updated on Sep 6 2026 2:25 AM

రాయగడ: జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన జేకేపూర్‌ దుర్గాపూజ ఉత్సవాల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది దుర్గాపూజలకు శ్రీకారం చుడుతూ జేకేపూర్‌లో భూమిపూజ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో జేకే పేపర్‌ మిల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కమర్షియల్‌) విశ్వజీత్‌ ద్వివేది, జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌, ఐఆర్‌) సందీప్‌ పాండే, చందిలి పోలీస్‌స్టేషన్‌ ఐఐసీ ఉత్తమ్‌ కుమార్‌ సాహు తదితరులు పాల్గొన్నారు. పదకొండు రోజులపాటుగా జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవాలను తిలకించేందుకు ప్రతిఏటా వస్తుంటారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది మరింత భద్రత ఏర్పాట్లతో పాటు వారికి అన్ని రకాల సౌకర్యాలను కలిగించేలా నిర్వహక కమిటీ ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు.

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా దుర్గా ప్రసాద్‌ శర్మ

జయపురం: కొరాపుట్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు దుర్గా ప్రసాద్‌ శర్మ ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. దుర్గాప్రసాద్‌ శర్మ ఇదివరకు జయపురం మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌, జయపురం తెలుగు సాంస్కృతిక సమితి సభ్యుడు, సిటీ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ మాజీ సభ్యుడు, కొరాపుట్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ మాజీ ఉపాధ్యక్షుడు, డీసీసీ మాజీ కార్యదర్శి, రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ మాజీ కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మాజీ కార్యదర్శి, డీసీసీ ఉపాధ్యక్షుడు తదితర పదవులు నిర్వహించారు. ఆయన నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఏటీఎం లూటీకి విఫలయత్నం

జయపురం: జయపురం సదర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో స్టేట్‌బ్యాంక్‌కు చెందిన ఏటీఎం లూటీ చేసేందుకు విఫలయత్నం చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జయపురం సదర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి అంబిగుడ పోలీసు పంటి ఏఎస్‌ఐ సుశాంత కుమార్‌ జెన ఆధ్వర్యంలో పోలీసులు రాత్రి పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అయితే ఆ సమయంలో అంబాగుడ గ్రామంలోని స్టేట్‌బ్యాంక్‌ ఏటీఎం లూటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లగా.. ముఖానికి నల్లని వస్త్రం చుట్టుకొని లూటీకి ప్రయత్నిస్తున్న వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు సీసీ ఫుటేజీ అధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడు బొరిగుమ్మ సమితి డొంగర గ్రామం మనోజ్‌ దిసారిడిని శనివారం అరెస్టు చేసి, అతడి నుంచి ఒక ఇనుప రాడ్డు, ఒక స్క్రూ డ్రైవర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జయపురం సదర్‌ పోలీసుస్టేషన్‌ అధికారి జచీంధ్ర ప్రధాన్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement