బిసంకటక్‌ కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు | - | Sakshi
Sakshi News home page

బిసంకటక్‌ కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు

Sep 6 2026 2:25 AM | Updated on Sep 6 2026 2:25 AM

రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌ సమితి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. కొరాపుట్‌ లోక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉలక తీసుకున్న నిర్ణయాలు, ఆయన వ్యవహారశైలిపై స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంపీ ప్రతినిధి ఎంపిక విషయంలో స్థానిక నాయకత్వాన్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ సమితి కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన గళం వినిపించారు. బిసంకటక్‌ సమితి కాంగ్రెస్‌ అధ్యక్షుడు కృష్ణ నణకా పిలుపు మేరకు స్థానిక పీడబ్ల్యూడీ ప్రాంగణంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమితిలోని 21 పంచాయతీల నుంచి వంద మందికి పైగా ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంపీ ఉలక, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక లు బిసంకటక్‌ సమితిలో సందర్శించడం, స్థానిక నాయకుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడంపై జిగిడి సర్పంచ్‌ అజిత్‌ సరక తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమావేశంలో పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో చర్చించకుండా అశోక్‌ ఆచార్యను ఎంపీ ప్రతినిధిగా నియమించడాన్ని పలువురు కార్యకర్తలు తీవ్రంగా వ్య తిరేకించారు. ఈ నియామకాన్ని వెంటనే పునః పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా నిర్ణయాలు కొనసాగితే భవిష్యత్‌లో ఎంపీ ఉలక బిసంకటక్‌ పర్యటనకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు, ఘెరావ్‌ ఎదుర్కొవాల్సి వస్తుందని సమావేశంలో హెచ్చరించినట్లు సమాచారం. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే నీలమాధవ హికక పైనా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, వారు సమస్యల్లో ఉన్న సమయంలో ఫోన్‌ చేసినా స్పందించడం లేదని పలువురు ఆరోపించారు. సమావేశంలో బిసంకటక్‌ సమితికి చెందిన పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, పంచాయతీ స్థాయి కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement