మజ్జిగౌరీ అమ్మవారి హుండీ ఆదాయం రూ. 54.15 లక్షలు | - | Sakshi
Sakshi News home page

మజ్జిగౌరీ అమ్మవారి హుండీ ఆదాయం రూ. 54.15 లక్షలు

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం.. మజ్జిగౌరీ అమ్మవారికి భక్తులు వేసే కానుకల రూపంలో వచ్చిన హండీ ఆదాయాన్ని అధికారులు సోమవారం లెక్కించారు. ఎండోమెంట్‌ కమిషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పుష్పిత బెహర, మందిరం నిర్వహక కమిటీ సభ్యులు రాధాకృష్ణ దలాయి, పెద్దిన వాసు, దేవేంద్ర బెహర, మంగరాజ్‌, మందిరం సూపరింటెండెండ్‌ జానకీ వల్లభ మహాంతి, జేయీ వెంకట్‌, అకౌంటెంట్‌ వెంకటరావు తదితరుల సమక్షంలో మందిరం ప్రాంగణంలోని తొమ్మిది హుండీలను ఉదయం పది గంటలకు తెరిచారు. అనంతరం ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం అయిదున్నర గంటల వరకు సాగింది. స్థానికంగా గల సేవా సంస్థలకు చెందిన 80 మంది మహిళలు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. నగదు రూపంలొ అమ్మవారికి 54,15,902 రూపాయలు లభించగా, 64 గ్రాముల బంగారం, 1.764 కిలోల వెండి లభించింది. లెక్కింపులో భాగంగా విదేశీ నాణాలు, విదేశీ కరెన్సీనోట్లు కూడా హుండీలొ లభించాయి. ఈ సందర్భంగా మందిరం నిర్వాహక కమిటీ సభ్యులు రాధాక్రిష్ణ దొలాయి విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్‌ నెల 29వ తేదీన హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టగా అప్పట్లో ఒకకోటీ 22 లక్షల 29 వేల 623 రూపాయల నగదుతోపాటు 32 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి ఆభరణాలు, తొమ్మిది విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని వివరించారు.

ఇకపై రెండు నెలలకోసారి లెక్కింపు

అమ్మవారి హుండీ ఆదాయం ఇదివరకు ప్రతీ మూడు, నాలుగు నెలలకొసారి తెరిచి లెక్కింపు చేపట్టేవాళ్లమని అన్నారు. అయితే లెక్కింపు నిర్వహణ ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇకపై ప్రతీ రెండు నెలలకొసారి హుండీ ఆదాయాన్ని లెక్కించాలని నిర్ణయించామన్నారు. ఈసారి చేపట్టిన హుండీ లెక్కింపులో అమ్మవారికి లభించిన నగదును స్థానిక యూనియన్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేస్తున్నట్లు తెలిపారు.

అమ్మవారి హుండీలో భక్తుడి ఆవేదన లేఖ

మజ్జిగౌరమ్మ హుండీ లెక్కింపు సందర్భంగా ఓ భక్తుడి ఆవేదనతో కూడిన ఆరు పేజీల లేఖ బయటపడింది. అప్పుల భారంతో సతమతమవుతున్న ఓ భక్తుడు తన కష్టాలను అమ్మవారికి మొరపెట్టుకుంటూ రాసిన లేఖను చదివిన ఆలయ సిబ్బంది, అక్కడున్న పలువురు భక్తులు భావోద్వేగాలకు గురయ్యారు. కొరాపుట్‌ జిల్లాకు చెందిన భక్తులు సునీల్‌ ఖొర ఈ లేఖను అమ్మవారికి సమర్పించినట్లు తెలుస్తోంది. సుమారు 23 మంది వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నానని, ఇప్పటివరకు వాటిని పూర్తిగా చెల్లించలేకపొయానని ఆయన తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అప్పుల కారణంగా తాను, తన కుటుంబం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని, ఈ కష్టాల నుంచి తనను గట్టెక్కించి రుణ విముక్తుడిని చేయాలని మజ్జిగౌరి అమ్మవారిని వేడుకున్నారు.

అమ్మవారిపై అంచంచల విశ్వాసం

మనిషి అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు భావించినప్పుడు తన బాధను దేవుడి పాదాల వద్ద చెప్పుకుంటాడనే భావనకు ఈ లేఖ అద్దం పడుతోంది. తన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులను వివరిస్తు భక్తుడు అమ్మవారిపై ఉన్న అచంచల విశ్వాసంతో తన మనసులోని మాటలను లేఖ రూపంలో చెప్పుకున్నాడు. హుండీ నుంచి బయట పడిన ఈ ఆరు పేజీల లేఖ కేవలం ఓ భక్తుడి మొక్కుబడి మాత్రమే కాకుండా.. అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తి ఆవేదన, కుటుంబంపై ఉన్న ఆందోళన , కుటుంబంపై ఉన్న అపరామైన నమ్మానికి ప్రతిబింబంగా నిలిచింది అనడంలో అతిఽశయోక్తి కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement