కొత్త జాతీయ అటవీ కమిటీలకు రూ.560 కోట్లు | - | Sakshi
Sakshi News home page

కొత్త జాతీయ అటవీ కమిటీలకు రూ.560 కోట్లు

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

భువనేశ్వర్‌: ఈ ఏడాది స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తగా నగరాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ పిలుపునిచ్చారు. యువతకు కొత్త అవకాశాలు, ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామికవేత్తల ఆవిష్కరణ దిశలో నగరాలు విస్తరించాలని ఆకాంక్షించారు. స్థానిక ఓయూఏటీ కృషి శిక్షా సదన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమంలో కొత్తగా ఏర్పడిన 28 జాతీయ అటవీ కమిటీల్లో (ఎన్‌ఏసీ) వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రూ. 560 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ప్రతి జాతీయ అటవీ కమిటీకి (ఎన్‌ఏసీ) రూ. 20 కోట్లు కేటాయించనున్నారు. ఈ నిధులతో సంబంధిత ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీలు, మార్కెట్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పట్టణాభివృద్ధి పథకం కింద 62 పట్టణ ప్రాంతాల కోసం రూ. 323 కోట్ల పెట్టుబడితో 593 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిలో రూ. 102 కోట్ల విలువైన 423 ప్రాజెక్టులను ప్రారంభించగా రూ. 221 కోట్ల విలువైన 170 ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. వివిధ పనుల నిమిత్తం మున్సిపల్‌ సంస్థలకు వచ్చే పౌరులకు గౌరవప్రదమైన సేవలు అందించాలని మున్సిపల్‌ పరిపాలన అధికారులు, ఉద్యోగులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృత వినియోగంతో పని విధానాలను సరళీకరించి నిర్ధారిత కాలపరిమితిలో పూర్తి చేసే పని సంస్కృతిని అలవరచుకోవాలని మున్సిపల్‌ సంస్థలకు ముఖ్యమంత్రి సూచించారు. ఒడిశా ఆర్థికాభివృద్ధికి ప్రతి నగరాన్ని ఒక శక్తివంతమైన చోదక శక్తిగా మార్చాలని కోరారు.

స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పురపాలక సంస్థల సామర్థ్య పెంపు కోసం ఒడిశా అర్బన్‌ అకాడమీ, శ్రీ శ్రీ యూనివర్సిటీ, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మరియు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ అఫైర్స్‌ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీనితో పాటు సీఆర్‌యూటీ, శ్రీ శ్రీ యూనివర్సిటీ మధ్య కూడా ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. 115 పురపాలక సంస్థలలో ఓస్వాన్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన – బంధు, ఒడిశా యాత్రి ఎస్‌ఓఎస్‌ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో ఇటీవల 28 కొత్త నోటిఫైడ్‌ ఏరియా కౌన్సిళ్లు, 7 కొత్త మున్సిపల్‌ కౌన్సిళ్లు ఏర్పడ్డాయి. పూరీకి మెట్రోపాలిటన్‌ కార్పొరేషన్‌ హోదా కల్పించాలని రాష్ట్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ కృష్ణ చంద్ర మహా పాత్రో తెలిపారు. రాష్ట్రంలోని పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న ఎన్‌ఏసీ, మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో భువనేశ్వర్‌ ఏకామ్ర నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్‌, భువనేశ్వర్‌ నగర పాలక సంస్థ బీఎంసీ మేయర్‌ సులోచన దాస్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్‌, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఉషా పాఽఢి, పురపాలక పరిపాలన సంచాలకులు అరిందమ్‌ డకువా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement