రాయగడ : గూడ్స్ రైళ్ల నుంచి కొంతకాలంగా జరుగుతున్న సరుకుల చోరీకి అంబొదల పోలీసులు బ్రేక్ వేశారు. ఇచ్చాపురం, అంబొదళ ప్రాంతంలో గూడ్స్ రైళ్ల నుంచి బియ్యం బస్తాలను దించుతున్న దుండగులను పోలీసులు గుర్తించి దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు 150 బియ్యం బస్తాలు, 10 సైకిళ్లను విడిచి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని దుండగులు చాలా కాలంగా గూడ్స్ రైళ్ల బోగీల నుంచి బియ్యం, చక్కెర, గోధుమలు, సిమెంట్, ఎరువులు తదితర వస్తువులను చోరీ చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ మేరకు మంగళవారం రాత్రి అంబొదల పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అశోక్‌కుమార్ ప్రధాన్ సిబ్బందితో కలిసి ఇచ్ఛాపురం ప్రాంతంలో పెట్రొలింగ్ నిర్వహించారు. ఇఛ్చాపురం పంచాయతీ గడియాజోల గ్రామ సమీపంలో రైల్వే పట్టాల వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి కొందరు వ్యక్తులు బియ్యం బస్తాలను కిందకు దించుతుండటం గమనించి దాడులు నిర్వహించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలను టిట్టాఘడ్ రైల్వే పోలీసులకు అప్పగించారు.


